టెన్షన్‌లో టీడీపీ.. కూల్‌గా వైఎస్సార్‌సీపీ | TDP in Tension Over Winning Where As YSRCP in a Cool About Their Win | Sakshi
Sakshi News home page

టెన్షన్‌లో టీడీపీ.. కూల్‌గా వైఎస్సార్‌సీపీ

Published Wed, May 22 2019 10:26 AM | Last Updated on Wed, May 22 2019 10:26 AM

TDP in Tension Over Winning Where As YSRCP in a Cool About Their Win - Sakshi

సాక్షి, నెల్లూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు సమయం వచ్చేస్తోంది. మరో 24 గంటల్లో లెక్కింపు ప్రారంభం కానుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గుచూపారని వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. విజయం మాదేనన్నా ధీమా కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థుల్లో ప్రభుత్వ వ్యతిరేకత, వెన్నుపోట్లు వెరసీ ఓటమి భయం వెంటాడుతోంది. 

ఎంతో ఆసక్తిగా..
జిల్లా ఓటర్లు ఏ తీర్పు ఇస్తారనేది మరికొన్ని గంట్లో తేలనుంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగనుండడంతో ఫలితాల కోసం అనేకమంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లా పరిస్థితి భిన్నంగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. దివంగత నేత వైఎస్‌ రాజÔóశేఖరరెడ్డిపై వీరాభిమానం పెంచుకున్న జిల్లావాసులు తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రస్తుతం ఉన్న పది సీట్లగానూ అన్నిచోట్లా ఫ్యాన్‌ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పదింట ఏడుచోట్ల విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్‌సీపీ ఈదఫా పది నియోజకవర్గాల్లో ఎక్కడా ఓటమికి తావివ్వకుండా అభ్యర్థులు కష్టపడి పనిచేశారు. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న బలమైన ఆకాంక్ష తోడు కావడంతో విజయం తప్పదని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.  

టీడీపీ నేతల్లో భయం
ఈసారి ఎన్నికల్లో అధికార టీడీపీ ఆర్థిక కుబేరునుల రంగంలోకి దించింది. గెలుపు కోసం అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. గ్రామస్థాయిలో చోటామోటా నేతలకు ప్యాకేజీలు ఎరవేశారు. ఆ పని చేస్తాం.. ఈ పనిచేస్తామంటూ రూ.లక్షలు వెచ్చించారు. ప్రతి ఓటుకు రూ.2 వేల నోటు ఇచ్చి ఎన్నో ప్రలోభాలకు గురిచేశారు. కానీ ఎంత ప్రలోభాలకు గురిచేసినా పోలింగ్‌ రోజు మాత్రం ఓటర్లు ఫ్యాన్‌వైపే మొగ్గు చూపారని ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడి కావడంతో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. 

వెన్నుపోటు భయం
నెల్లూరు నగరంలో మంత్రి నారాయణకు, ఉదయగిరిలో బొల్లినేని రామారావుకు టీడీపీ నాయకులే వెన్నుపోటు పొడిచారని వెలుగులోకి రావడంతో అభ్యర్థులు ఓడిపోతామని ఆందోళన చెందుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పోలింగ్‌ ముందే టీడీపీ అభ్యర్థి పరసారత్నం ఓటమి తప్పదని గ్రహించి ఎన్నికల నిర్వహణ చేయకుండానే చేతులెత్తేశారు. కావలి నియోజకవర్గంలో బీద బ్రదర్స్‌ వెన్నుపోటు రాజకీయం అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వైఎస్సార్‌సీపీ కంచుకోటగా ఉన్న ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య నోట్ల వర్షం కురిపించి ఓటుకు రూ.2 వేలు వంతున పంపిణీ చేసినా ఓటర్లు మాత్రం వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపారని పోలింగ్‌సరళిలో, ఎగ్జిట్‌పోల్‌ ఫలితాల్లో వెల్లడించడంతో బొల్లినేనికి ఓటమి భయం పట్టుకుంది.

సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డి ఐదేళ్లలో సంపాదించిన సొమ్మంతా ఎరులైపారించారు. అయినా ఓటర్లు మాత్రం వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని తెలియడంతో సోమిరెడ్డికి చెమటలు పడుతున్నాయి. గూడూరు, కోవూరులో అధికార పార్టీలో వెన్నుపోటు రాజకీయాలతో వార్‌ వన్‌సైడ్‌గా మారడంతో పాశం సునీల్‌కుమార్‌కు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.

నవరత్నాలే నడపించాయి 
వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లపాటు చేసిన ప్రజా పోరాటాలు, ప్రజా సంకల్పయాత్రతో కన్పించన భరోసా, ప్రకటించిన నవరత్నాల పథకాలు వెరసీ ఒక్కసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలన్న ప్రజల ఆకాంక్షతో విజయం తమదేనని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు చెబుతున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు చూసిన తర్వాత విజయం ఇక నల్లేరుపై నడకేనంటూ ఆ పార్టీ అభ్యర్థులు కూల్‌గా ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement