గ్రామ పంచాయతీ కార్యాలయం
సాక్షి, సోమశిల (నెల్లూరు): సార్వత్రిక ఎన్నికలు ముగిసి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు చెల్లాచెదురయ్యారు. గతేడాది ఆగస్టులో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపకపోవడంతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తప్రభుత్వం కొలువుదీరింది. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అవి అయిపోగానే వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుండడంతో తగిన విధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో 133 పంచాయతీలు ఉండగా సార్వత్రిక ఎన్నికలఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 2,08,990 మంది ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 1,03,763 మంది, మహిళా ఓటర్లు 1,05,215 మంది, థర్డ్‌జెండర్ ఓటర్లు 12 మంది ఉన్నారు. ఈ ఓటర్లు పంచాయతీలకు సర్పంచ్‌లను ఎన్నుకోవడంతోపాటు ఆయా గ్రామాల్లోని వార్డు సభ్యులను ఎన్నుకోవాల్సిఉంది.
వైఎస్సార్‌సీపీ జోష్.. టీడీపీ డీలా
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేసి పార్టీ శ్రేణులు ఆనందోత్సహాల్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటర్లు భారీ మెజారిటీని అందించారు. టీడీపీకి పట్టున్న గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. దీంతో అధికారపార్టీ వైఎస్సార్‌సీపీ కేడర్ ఫుల్ జోష్‌లో ఉంది. టీడీపీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన వ్యక్తి ప్రజల్లో కనిపించడం లేదు. ఘోర పరాజయంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. చాలా గ్రామాల్లో టీడీపీ నేతలు చెల్లాచెదురయ్యారు. దీనికితోడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పార్టీ అధినాయకుడు చంద్రబాబు పోలింగ్ తరువాత గట్టి ధీమా వ్యక్తం చేయడంతో ఆయన మాటలు నమ్మి అనేక మంది నేతలు, కార్యకర్తలు బెట్టింగ్‌లకు దిగి తీవ్రంగా నష్టపోయారు. అంతేకాక ఎన్నికల్లో అధిక మొత్తంలో ఖర్చు పెట్టిన అంచనాలకు అందని పరాజయం కూడా అభ్యర్థులను కృంగదీసింది.
పంచాయతీ ఖర్చుపై చర్చ
జిల్లాలో ఎన్నికలు ఆర్థికంగా భారంగా మారాయి. ఒక్కో ఓటుకు రూ.4 వేలు వెచ్చించి పార్టీలు ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఓటర్లు ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఎవరికైనా సరే తమకు ఎంత ఇస్తారనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటరుకు రూ.1000 నుంచి రూ.3 వేల వరకు పంచాల్సి వస్తుందేమోనని నేతలు దీర్ఘాలోచనలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ఆర్థికంగా మోయలేని భారంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రూ.లక్షల్లో ఖర్చు చేసి ఎన్నికల్లో నిలబడేందుకు టీడీపీ కేడర్ సిద్ధంగా లేదని తెలుస్తోంది.
దీంతో చాలా పంచాయతీల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు నగదు సాయం చేస్తేనే పంచాయతీ ఎన్నికల్లో నిలబడాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో ఓటర్లు ఎంతవరకు తమ పార్టీకి సహకరిస్తారనే సంశయం కూడా ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వదిలేస్తే పార్టీ కేడర్ మరింత దెబ్బతింటుందనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వదిలేయాలా అనే సందిగ్ధంలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment