అరసవల్లి : ఈ నెల 9న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికార సిబ్బంది పనిచేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్–2 రజనీకాంతారావు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఎన్నికల సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. ఇందుకోసం 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మూడు జిల్లాల్లో 1,55,933 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు. ఓటర్ల జాబితాలను పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు.
జోనల్ అధికారులకు మెజిస్ట్రీరియల్ అధికారాలు ఉంటాయని, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించారు. జిల్లాలోని మూడు డివిజన్లలో పోలింగ్ ప్రక్రియలో ఎక్కడా అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నకిలీ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైలెట్ రంగు స్కెచ్‌పెన్‌తోనే ప్రాధాన్యతా ఓటును వేయించాలని, ఓటు వేసిన బ్యాలట్ పత్రాన్ని నిబంధనల ప్రకారం మడత పెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేయించాలని సూచించారు. అంధ ఓటర్లు మూడు రోజుల ముందుగానే రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. బ్యాలట్ బాక్సులను సీల్ చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తేవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కిషోర్ కుమార్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.