సాక్షి, హైదరాబాద్: డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తి అవుతుందని తెలంగాణ ప్రాంత మంత్రులు చెప్పారు. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, అధిష్టానం పెద్దలు, కేంద్ర మంత్రులు కూడా ఈ విషయం చాలాసార్లు చెప్పారని అన్నారు. కొందరు ముఖ్య నేతలతో కలిసి వీరు శనివారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో తెలంగాణ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. , మంత్రులు కె.జానారెడ్డి, బసవరాజు సారయ్య, డి.కె.అరుణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఎంపీ రాజయ్య, మాజీమంత్రి షబ్బీర్ అలీ, జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ ఎం.కోదండరాం, కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, అధికారప్రతినిధులు సి.విఠల్, అద్దంకి దయాకర్, అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నిర్ణయం, సీమాంధ్ర ఉద్యమం, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి, కేంద్ర ప్రభుత్వ జాప్యం, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల మౌనం, ఈ నెల 7న నిర్వహించబోయే మహాశాంతి ర్యాలీ వంటివాటిపై చర్చించారు. మంత్రులు మాట్లాడుతూ.. ‘సీడబ్ల్యూసీ నిర్ణయం అమలయ్యేదాకా పరస్పర అవగాహనతో, జాతీయస్థాయిలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండొద్దు. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని చాలాసార్లు చెప్పినందున ఇంకా అనుమానాలు అవసరం లేదు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను, ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడొద్దని అధిష్టానం మాకు సూచించింది. అందుకే కొంత సంయమనంతో ఉంటున్నాం’ అని వివరించారు. తెలంగాణ విజయోత్సవాలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పినట్టు సమాచారం. జేఏసీ నేతలు మాట్లాడుతూ ..‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించి ఇప్పటికే నెల దాటిపోయింది. ఇంకా కేబినెట్ నోట్ కూడా తయారుకాలేదు.
ఎలాంటి రాజ్యాంగపరమైన కదలికలూ లేవు. మరోవైపు సీమాంధ్రలో ఉద్యమాలను, ఏపీఎన్జీఓలను సమ్మెను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగితే విరమించాలంటూ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీఓల సమ్మె విరమణకు సీఎం ఎందుకు అప్పీల్ చేయరు? సీఎం, ఆ ప్రాంత మంత్రులు ఏం చేస్తున్నారు? తెలంగాణప్రాంత మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? సీఎం ఏం మాట్లాడుతున్నా ఎందుకు ప్రశ్నించరు? కనీసం కేబినెట్ నోట్ కూడా తయారుకాకుంటే నమ్మేదెలా? కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎలా మాట్లాడగలం? వ్యతిరేకులపై కనీసం నోరుకూడా విప్పకుండా విజయోత్సవాలు చేసుకుంటే ఎలా?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన మహా శాంతి ర్యాలీకి ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకురావాల్సిన బాధ్యత కూడా మంత్రులదే అని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
అదుపు చేయలేకపోతే సభలకు అనుమతులొద్దు: జానా
ఏపీఎన్జీఓలు చేస్తున్న సమ్మెను విరమింపజేసే బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. భేటీ అనంతరం మంత్రులు, జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విభజనకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనవసరమైన అల్లర్లు, గొడవలు జరుగకుండా అదుపు చేయగలిగినవారే హైదరాబాద్‌లో సభలు జరపాలని ఆయన సూచించారు. పరిస్థితులను అదుపు చేయలేకపోతే ఇరుప్రాంతాల వారి సభలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వానికి సూచించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని జేఏసీ నేతలు కోదండరాం తదితరులు అన్నారు. సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగడం అనైతికమన్నారు.
తెలంగాణపై అనుమానాలొద్దు
Published Sun, Sep 1 2013 2:37 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement