కనిగిరి, న్యూస్‌లైన్: ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ తదితర శిక్షణలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు ఆర్‌వీఎం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘భవిత’ కేంద్రాలు అసౌకర్యాలతో కునారిల్లుతున్నాయి. జిల్లాలోని 19 భవిత కేంద్రాల్లో సుమారు 400 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలు శిక్షణ పొందుతున్నారు.
వికలాంగుల భవిత కోసం...
జిల్లాలో భవిత కేంద్రాలకు ఒక్కోదానికి రూ.9 లక్షలతో 19 చోట్ల పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో తాళ్లూరు, దర్శి, త్రిపురాంతకంలో ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. బేస్తవారిపేటలో భవన నిర్మాణం మధ్యలోనే ఆగింది. నాలుగు చోట్ల స్థలాలే దొరకలేదు. భవిత భవనాలు కట్టని చోట ఎమ్మార్సీ కార్యాలయంలోనే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవనాలున్న చోట పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. అనేక చోట్ల తాగునీటి వసతి లేదు.
కేంద్రాల్లో కనిపించని 2-6 ఏళ్ల పిల్లలు:
భవిత భవనాల్లో 7-14 సంవత్సరాల (మానసిక వైకల్యం, చెవుడు, మూగ, అంధత్వం కలిగిన) పిల్లలకు ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ (నాన్ రెసిడెన్షియల్) స్కూల్, 2-6 ఏళ్ల లోపు (మానసిక వైకల్యం, చెవుడు, మూగ, అంధత్వం కలిగిన) పిల్లలకు ఎర్లీ ఇంటర్‌వెన్షన్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. వీరికి శిక్షకులు వారంలో ఐదు రోజులు శిక్షణ ఇస్తారు. శనివారం మాత్రం ప్రత్యేక అవసరాలున్న పిల్లల ఇళ్లకు వెళ్లి శిక్షణలిస్తారు. అయితే భవిత భవనాల్లో 7-14 సంవత్సరాల వయసున్న పిల్లలు శిక్షణ పొందుతున్నా..2-6 ఏళ్ల వయసున్న పిల్లలు ఎక్కడా రావడం లేదు. అధికారులు పిల్లల తల్లిదండ్రులకు తగిన అవగాహన కల్పించకపోవడం, ప్రభుత్వం కనీస సహకారం అందించకపోవడమే దీనికి కారణం.
ఇవ్వని రవాణా అలవెన్స్ నిధులు...
జిల్లాలో 19 భవిత కేంద్రాల్లో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలను జూన్‌లో ప్రారంభించారు. 7-14 సంవత్సరాల వయసున్న పిల్లలకు రవాణా అలవెన్స్‌ను ఒక్కొక్కరికి నెలకు రూ.300 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. కానీ అవి ఈ ఏడాది ఇప్పటి వరకు ఇవ్వలేదు. గుంటూరు జిల్లాలో నగదుకు బదులు పిల్లల్ని భవిత భవనాలకు తీసుకొచ్చేందుకు వాహనాలు సమకూర్చినట్లు సమాచారం. కానీ మన జిల్లాలో అవి కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలున్న పిల్లల్ని రోజూ శిక్షణలకు తీసుకొచ్చే స్థోమత లేక ఇళ్లల్లో ఉంటున్నారు. ఒకవేళ ఇబ్బందులు పడి తీసుకొచ్చినా..వారికి అక్కడ కనీస సౌకర్యాలుండటం లేదు. దీంతో అనేక మంది భవిత కేంద్రాలకు దూరమవుతున్నారు.
ఐఈ ఏమంటున్నారంటే...
దీనిపై రాజీవ్ విద్యామిషన్ ఐఈ(ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్) వెంకారెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ అడగ్గా రవాణా అలవెన్స్ నిధులు ఇంకా ఇవ్వలేదన్నారు. త్వరలో పిల్లల తల్లిదండ్రుల అకౌంట్‌కు నిధులు జమ చేస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం కొన్ని చోట్ల అమలు కానిది వాస్తవమేనన్నారు. మౌలిక వసతులు అన్ని చోట్ల కల్పిస్తామని చెప్పారు. 2-6 ఏళ్ల వయసున్న పిల్లలు పూర్తిస్థాయిలో వచ్చేట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
హాస్టల్ వసతి కల్పించండి
రమణమ్మ, వెంకటేశ్వరపురం
మా పిల్లలను భవిత కార్యాలయంలోనే ఉంచుతాం. రోజూ తీసుకొచ్చేందుకు మా దగ్గర చార్జీలకు డబ్బులు లేవు. కూలీ చేసుకుని జీవించే వాళ్లం రోజూ రావాలంటే కుదరడం లేదు. అలాగని బిడ్డ భవిష్యత్‌ను నాశనం చేసుకోలేను. హాస్టల్ సౌకర్యం కల్పిస్తే ఇక్కడే చేర్చి వారానికి ఒక్కరోజు వచ్చి చూసుకుంటాం.
ఇబ్బంది పడుతున్నాం
వెంకట సుబ్బమ్మ, సుల్తాన్‌పురం
ప్రభుత్వం రవాణా చార్జీలను వెంటనే విడుదల చేయాలి. లేదంటే రవాణాకు వాహన సౌకర్యాలు కల్పించాలి. రోజూ తిరగలేక అనేక మంది తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలున్న పిల్లలను తీసుకు రాలేకపోతున్నారు.
‘భవిత’కు లేదు భరోసా
Published Mon, Nov 25 2013 6:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement