కుటుంబ కలహాలు లేవు: విషిత తండ్రి
హైదరాబాద్ : తమ మధ్య ఎలాంటి కుటుంబ కలహాలు లేవని విషిత తండ్రి, ఉదయ్ కిరణ్ మామ గోవింద రాజన్ తెలిపారు. ఆయన తన అల్లుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావటం లేదన్నారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, అయితే చిత్ర పరిశ్రమలో తాను ఒంటరి అనే బాధపడుతు ఉండేవన్నారు. కెరీర్ విషయంలో ఉదయ్ కిరణ్ చాలారోజులుగా నిరాశా నిస్పృహలతో ఉన్నాడని తెలిపారు.
భార్యా భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న వివాదలు సాధారణమని, అవి గొడవలు అనలేమని గోవింద రాజన్ అన్నారు. ఉదయ్ కిరణ్-విషిత మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలిస్తే తాము అతన్ని ఒంటరిగా వదిలి వెళ్లేవాళ్లమే కాదని ఆయన తెలిపారు. అప్పటివరకూ అందరం కలిసే సినిమా చూశామని, ఆతర్వాత బర్త్డే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు.
ఉదయ్ కిరణ్కు గతంలో అతని తండ్రితో ఏవో గొడవలు ఉండేవని గోవింద రాజన్ తెలిపారు. కాగా ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి .... రెండో పెళ్లి చేసుకోవటంతో గత ఆరేళ్ల నుంచి వారి మధ్య సంబంధాలు లేవు. మరోవైపు ఉదయ్ కిరణ్ మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదని సమాచారం.