Vishita
-
ఉదయ్‌కిరణ్ ఆఖరి చిత్రం ఇదే అంటే బాధగా ఉంది : విషిత
‘‘ఉదయ్‌కిరణ్ హీరోగా 14 చిత్రాల్లో నటిస్తే, నేను 9 సినిమాలకు పాటలు స్వరపరిచాను. ‘చిత్రం’ సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’తో ముగియడం బాధాకరం. ఈ చిత్రానికి మున్నా కాశీ మంచి పాటలు ఇచ్చి ఉంటారని ఊహిస్తున్నా’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఉదయ్‌కిరణ్ హీరోగా ఆయన మేనేజర్ మున్నా నిర్మించిన సినిమా ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’. డింపుల్, మదాలసా శర్మ, గరిమ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ ఎ.యల్.ఆర్.కె. దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మల్టీ డైమన్షన్ వాసు సీడీని ఆవిష్కరించి ఉదయ్‌కిరణ్ భార్య విషితకు అందజేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయం చేకూర్చి, ఉదయ్‌కి ఘన నివాళి ఇవ్వాలని కోరుకుంటున్నానని వాసు అన్నారు. ఉదయ్ ఆఖరి చిత్రం ఇదేనంటే చాలా బాధగా ఉందని, నిజజీవితంలోనూ తను హీరో అని విషిత చెప్పారు. ఉదయ్ నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయని, ఈ చిత్రం కూడా ఆ కోవలోకి చేరాలనే తపనతో మంచి పాటలు ఇవ్వడానికి ప్రయత్నం చేశానని మున్నా కాశీ అన్నారు. నిర్మాతగా తన మొదటి సినిమా ఉదయ్‌కి చివరి సినిమా అవుతుందనుకోలేదని మున్నా అన్నారు. ఉదయ్‌తో సినిమా చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి, బావ ప్రసన్న కుమార్, వారి కుమారుడు తేజ, కుమార్తె మంజు కూడా పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలు లేవు: విషిత తండ్రి
హైదరాబాద్ : తమ మధ్య ఎలాంటి కుటుంబ కలహాలు లేవని విషిత తండ్రి, ఉదయ్ కిరణ్ మామ గోవింద రాజన్ తెలిపారు. ఆయన తన అల్లుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావటం లేదన్నారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, అయితే చిత్ర పరిశ్రమలో తాను ఒంటరి అనే బాధపడుతు ఉండేవన్నారు. కెరీర్ విషయంలో ఉదయ్ కిరణ్ చాలారోజులుగా నిరాశా నిస్పృహలతో ఉన్నాడని తెలిపారు. భార్యా భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న వివాదలు సాధారణమని, అవి గొడవలు అనలేమని గోవింద రాజన్ అన్నారు. ఉదయ్ కిరణ్-విషిత మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలిస్తే తాము అతన్ని ఒంటరిగా వదిలి వెళ్లేవాళ్లమే కాదని ఆయన తెలిపారు. అప్పటివరకూ అందరం కలిసే సినిమా చూశామని, ఆతర్వాత బర్త్‌డే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఉదయ్ కిరణ్‌కు గతంలో అతని తండ్రితో ఏవో గొడవలు ఉండేవని గోవింద రాజన్ తెలిపారు. కాగా ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి .... రెండో పెళ్లి చేసుకోవటంతో గత ఆరేళ్ల నుంచి వారి మధ్య సంబంధాలు లేవు. మరోవైపు ఉదయ్ కిరణ్ మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదని సమాచారం. -
బతకాలని లేదంటూ.... పలుమార్లు!
-
బతకాలని లేదంటూ.... పలుమార్లు!
హైదరాబాద్ : తనకు బతకాలని లేదంటూ ఉదయ్ కిరణ్ తన భార్య విషితతో పలుమార్లు అన్నట్లు సమాచారం. రెండు వారాల క్రితం నుంచి అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ మూడ్ మార్చేందుకు విషిత ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో విషిత ఈ విషయాన్ని వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నామని, జనవరి 2న హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రాలేదని... ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు, దానితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని విషిత పోలీసులు తెలియచేసింది. ఉదయ్ కిరణ్ 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడాడు. ఏది ఏమైనప్పటికి టాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఉదయ్ కిరణ్ ఇకలేడు. అందరినీ దుఃఖ సాగరంలో ముంచి కన్నుమూశాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతను ఇప్పటివరకు మొత్తం 19 సినిమాల్లో నటించాడు. అందులో 16 తెలుగు, 3 తమిళ సినిమాలు ఉన్నాయి. ఉదయ్ కిరణ్ చివరి చిత్రం జై శ్రీరాం.. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఉదయ్‌కిరణ్ దిల్ కబడ్డీ అనే తెలుగు, వంబు సదాయి అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. -
ఐ లవ్ యూ అంటూ ఉదయ్ కిరణ్ చివరి మెసేజ్
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు భార్య విషితకు 'ఐ లవ్ యూ టూ' అంటూ చివరి మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇక ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ అతని నివాసానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. మృతదేహంపై ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నాయన్నారు. ఘటనా స్థలంలో ఉదయ్ కిరణ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకున్న తాడుతో పాటు, కళ్లజోడు, స్లిప్పర్స్ స్వాధీనం చేసుకున్నట్లు క్లూస్ టీమ్ అధికారులు తెలిపారు. ఉదయ్ కిరణ్ తన భార్యకు ఐ లవ్ యూ టూ అంటూ మెసేజ్‌ను పంపించినట్లు తెలుస్తుందన్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక రావల్సి ఉందన్నారు. మరోవైపు ఉదయ్ కిరణ్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఏసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నాడని, నెలరోజులుగా పరిస్థితులు బాగోలేదంటూ విచారణలో వెల్లడి అయ్యిందన్నారు. కెరీర్ సరిగా లేనందున తనకు చనిపోవాలని ఉందంటూ పదే పదే ఉదయ్ అనేవాడిన భార్య విషిత చెప్పినట్లు ఏసీపీ తెలిపారు. అవకాశాలు రాకపోవటంతో నిరాశకు లోనయ్యేవాడని విషిత వెల్లడించిందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలిస్తున్నామన్నారు. -
ఉదయ్ లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం యావత్ సిని పరిశ్రమను, అభిమానులను విషాదంలో నింపింది. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లవర్‌బాయ్ ఇక లేడన్న వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో, అందరితో కలివిడిగా ఉండే ఉదయ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం దిగ్ర్భాంతికి గురిచేస్తోందని పలువురు సిని ప్రముఖులు అంటున్నారు. ఉదయ్ కిరణ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూసిన అతను చిన్నవయసులోనే ప్రాణాలు తీసుకోవటం బాధాకరమన్నారు. చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. తన జీవితానికి సంబంధించి ఎదురుదెబ్బలను తట్టుకోగలిగాడన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణమైనవారిని విచారించి కఠినంగా శిక్షించాలన్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు ఉదయ్ కిరణ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.