ఉదయ్ లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం యావత్ సిని పరిశ్రమను, అభిమానులను విషాదంలో నింపింది. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లవర్‌బాయ్ ఇక లేడన్న వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో, అందరితో కలివిడిగా ఉండే ఉదయ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం దిగ్ర్భాంతికి గురిచేస్తోందని పలువురు సిని ప్రముఖులు అంటున్నారు.
ఉదయ్ కిరణ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూసిన అతను చిన్నవయసులోనే ప్రాణాలు తీసుకోవటం బాధాకరమన్నారు. చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు.
తన జీవితానికి సంబంధించి ఎదురుదెబ్బలను తట్టుకోగలిగాడన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణమైనవారిని విచారించి కఠినంగా శిక్షించాలన్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు ఉదయ్ కిరణ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.