నివ్వెరపోయిన అన్నవరం
నివ్వెరపోయిన అన్నవరం
Published Tue, Jan 7 2014 2:50 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వార్త విని
చలించిన ఆలయవర్గాలు
సత్యదేవుని సన్నిధిలో పెళ్లి జ్ఞాపకాలు
గుర్తుచేసుకొన్న స్థానికులు
2012, అక్టోబర్ 24న విషితతో వివాహం
అన్నవరం, న్యూస్‌లైన్ : సినీ హీరో ఉదయ్‌కిరణ్ మరణవార్త విని అన్నవరం ఉలిక్కిపడింది. సత్యనారాయణస్వామి సన్నిధిలో విషితతో వివాహం జరిగి రెండేళ్లు కూడా కాకుండానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త పలువురిని కలచివేసింది. సోమవారం ఉదయం నుంచి ఈ వార్త చానళ్లలో వస్తుంటే దేవస్థానం వర్గాలే కాదు, గ్రామస్తులు కూడా నివ్వెరపోయారు. ‘వివాహం నిన్న కాక మొన్న జరిగినట్టు ఉంది. ఇంతలోనే ఇలా జరిగిందేమిటి పాపం’ అని బాధపడ్డారు.
ఆర్భాటం లేకుండానే వివాహం
సెలబ్రిటీల వివాహాలు రత్నగిరిపై ఆర్భాటంగానే జరుగుతాయి. కానీ అందుకు భిన్నంగా, ఎటువంటి హంగామా లేకుండా 2012, అక్టోబర్ 24 (విజయదశమిరోజు)న జరిగింది సినీహీరో ఉదయ్‌కిరణ్ వివాహం. తన ప్రేమికురాలు, విషితను ఆయన ఆరోజు తెల్లవారుజామున వివాహం చేసుకున్నారు. ఆ రోజు వరకూ దేవస్థానంలో కూడా ఈ వివాహం గురించి ఎవరికీ తెలియదు. ఆ రోజు ఉదయం వివాహ మంటపానికి సంప్రదాయ వివాహ వస్త్రధారణతో ఉదయ్‌కిరణ్ విచ్చేయడంతో ఒక్కసారిగా ఈ వివాహం గురించి అందరికీ తెలిసింది. ఆయనను చూసేందుకు ఎక్కువమంది అభిమానులు, భక్తులు వచ్చారు. అప్పుడు కూడా తాను జైశ్రీరామ్ షూటింగ్‌లో ఉన్న గెటప్‌తోనే కనిపించారు. రాత్రి పది గంటలకు విషిత, ఉదయ్‌కిరణ్‌లు బంధుమిత్రుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. తెల్లవారుజామున సత్యదేవుని సన్నిధిలో వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. నవదంపతులు ఉదయం సత్యదేవుని వ్రతమాచరించారు. అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ వివాహానికి సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా తక్కువ మంది హాజరయ్యారు. హీరో అల్లరి నరేష్ మాత్రమే పెళ్లికి వచ్చినవారిలో చెప్పుకోతగిన వ్యక్తి.
వివాహం సమయంలో ఉదయ్‌కిరణ్ విలేకర్లతో మాట్లాడుతూ... ఈ వివాహంతో తనకు మళ్లీ స్టార్‌డమ్ వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విషిత మాట్లాడుతూ కేవలం ఆయన సినీహీరో అని తాను వివాహం చేసుకోలేదని, ఆయన మంచితనం తెలుసుకున్నానని అందుకే వివాహం చేసుకున్నానని తెలిపారు. ఏమైనా పెళ్లయి రెండేళ్లూ కూడా నిండకుండానే ఉదయ్‌కిరణ్ తనువు చాలించడం స్థానికంగా చాలామందిని కలచివేసింది.
Advertisement