
విభజిస్తే చరిత్ర క్షమించదు
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు. కేవలం అక్కడి నేతల పదవుల కోసమే రెండు ముక్కలు చేస్తున్నారు. తెలుగు జాతిని విభజిస్తే చరిత్ర క్షమించదు. హైదరాబాద్ సొంత ప్రాంతమనే భావనతో సీమాంధ్రులంతా రాజధాని అభివృద్ధి కోసం అహరహం కృషి చేశారు. విభజన ప్రకటనతోనే హైదరాబాద్‌లో సీమాంధ్రులను బెదిరిస్తున్న కేసీఆర్.. ఏకంగా రాష్ట్రం ముక్కలైతే అసలు అక్కడ సీమాంధ్ర ప్రజలను బతకనిస్తారా?’ అని వక్తలు ప్రశ్నించారు.
సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో విశాఖలోని కావేరి ఫంక్షన్ హాల్లో సోమవారం ‘ఎవరెటు?’ చైతన్యపథం చర్చా వేదిక జరిగింది. వివిధ రంగాల మేధావులు, ఉద్యోగ సంఘాలు, వృత్తినిపుణులు, వ్యాపారులు, గృహిణులు, విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం జరిగిన 50ఏళ్ల ఉద్యమం ఇప్పుడు సీమాంధ్రలో మూడు నాలుగు రోజుల ఉద్యమంతో సమానమన్నారు. సీమాంధ్ర ప్రజలంతా ఉద్యమిస్తున్నారని, నాయకుల సారథ్యం అవసరం లేదని వీరంతా తేల్చి చెప్పారు.
రాజీనామా చేయని నేతలకు బుద్ధిచెప్పేరోజులు రానున్నాయని హెచ్చరించారు. కాంగ్రెస్ తన సొంత ప్రయోజనం కోసం, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం విభజిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యుడు తిమ్మారెడ్డి మాట్లాడుతూ నాజీలను తలపించేలా కేసీఆర్ ఆంధ్ర ప్రజలను ద్వేషించడం కోసం కొంతమందికి శిక్షణిస్తున్నారన్నారని ఆరోపించారు. వ్యాపారవేత్త ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఎగువ రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ అనేక జలవివాదాలు ఎదుర్కొంటోందని, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించారు. ఆనాడు రాజధాని మద్రాసును త్యాగం చేశాక హైదరాబాద్‌ను అంతా కలిసి అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు రాజధానితో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మానసికంగా విడదీయలేని బంధం ఏర్పడిందని చెప్పారు. వైద్యురాలు ఐ.వాణి ప్రసంగిస్తూ విభజన వలన వైద్యపరంగా సీమాంధ్ర నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.