జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును పట్టించుకోని వైనం
విద్యార్థుల ఆందోళనల ఫలితం శూన్యం
ఇప్పటికైనా స్పందిస్తే మేలు..
ఆందోళనలు ఒకరివి.. ఫలితం మరొకరిది.. అన్న చందంగా తయారైంది జిల్లా గిరిజన విద్యార్థులది. గిరిజన యూనివర్సిటీ కోసం ఉట్నూర్‌లో స్థలం సేకరించగా ఆనంద పడిన విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నిర్మల్‌లో ఓ యూనివర్సిటీ ఏర్పాటు కానుండడంతో ఇక జిల్లా గిరిజన యూనివర్సిటీ కలగానే మారింది. ఇన్నాళ్లు యూనివర్సిటీ కోసం గిరిజనులు చేసిన ఆందోళనలు వృథా అయ్యాయి. ఉట్నూర్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గిరిజనుల అభివృద్ధి సాధ్యమయ్యేది. ఇదంతా జిల్లా ప్రజాప్రతినిధుల వైఫల్యమేనంటూ గిరిజన విద్యార్థిలోకం ముక్తకంఠంతో ఖండిస్తోంది. వారు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా మరోమారు ప్రయత్నాలు కొనసాగించాలని కోరుతున్నారు. - న్యూస్‌లైన్, ఉట్నూర్
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అనివార్యమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించగా.. తెలంగాణ బిల్లులోని పదకొండో అంశంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. అయితే.. ఈ యూనివర్సిటీ జిల్లాలోనే ఏర్పాటవుతుందని గిరిజనులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అంతేగాకుండా తెలంగాణ ఏర్పాటుతో జిల్లా విస్తీర్ణం పెద్దదిగా ఉండడంతో కొత్తగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు తప్పదు. దీంతోపాటు జిల్లాలో దాదాపు 70 శాతం మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు.
2008లో ప్రకటించినా..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే ఏడాది నవంబర్ 17న జీవో 797 కూ డా విడుదల చేసింది. కేంద్రం నిర్ణయానికి కట్టుబడు తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 ఆగస్టు 27న జిల్లా లో వర్సిటీ ఏర్పాటుకు జీవో 783 విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఆదివాసీలకు కేంద్ర స్థానమైన ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 300 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. అలాగే.. ఏడో నంబరు జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్ సౌకర్యం, తదితర వసతులు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
గిరిజన ప్రజాప్రతినిధుల పట్టింపేది..?
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై మొదటి నుంచీ గిరిజన ప్రజాప్రతినిధులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో మూడు శాసనసభ స్థానాలతోపాటు, ఎంపీ స్థానం నుంచి గిరిజన అభ్యర్థులు పదవుల్లో కొనసాగుతున్నారు. వీరిలో అధికార పార్టీ నుంచి గిరిజన అభ్యర్థి శాసన సభ సభ్యుడిగా ఉండడం కలిసి వచ్చే అంశం. వీరంతా ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపే అవకాశం లేకపోలేదు. కానీ.. నిర్మల్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపడం వారి వైఫల్యానికి అద్దంగా నిలుస్తోంది. అయితే.. మంత్రిత్వశాఖకు కేవలం ప్రతిపాదనలు పంపించగా.. ఏర్పాటు చర్యలు వేగవంతం కాకముందే గిరిజన ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మన గిరిజన ప్రజాప్రతినిధులు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలోనే గిరిజనుల సంఖ్య ఎక్కువ..
తెలంగాణ ఏరియాలో జిల్లాలోనే గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజన జనాభా ఉంది. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది తెగలకు పైగా ఆదివాసీ గిరిజనులు జీవిస్తున్నారు. గోండులు 2,63,515, లంబాడీలు 1,12,793, కోలాంలు 38,176, పర్‌ధాన్‌లు 26,029, మన్నెవార్‌లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటిలు 2,231, ఎరుకల 1,735, కోయా, ఇతర తెగలు 30,739 చొప్పున ఉన్నారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటైతే గిరిజనుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెరిగి జాతీయ, ప్రపంచ స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుంది.
ఆ పాపం ప్రజాప్రతినిధులదే!
Published Sun, Feb 2 2014 2:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement