జాకారంలో గిరిజన వర్సిటీ కోసం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిస్తున్న ఏపీఓ వసంతరావు(ఫైల్)
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ సిగలో మరో విద్యా కుసుమం విరబూయనుంది. ఎడ్యుకేషన్ హబ్‌గా వర్ధిల్లుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కొలువుదీరనుంది. జయశంకర్ జిల్లా ములుగు మండలం జాకారం గ్రామ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. అలాగే మామునూరు వెటర్నిటీ కాలేజీకి సంబంధించి వచ్చే జూన్ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి చెప్పారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ములుగులోనే..
యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదనలు ఉన్నాయి. మహబూబాబాద్ లేదా ములుగులో నెలకొల్పాలని తొలుత ప్రయత్నించారు. ఈ మేరకు ములుగు మండలం జాకారం గ్రామ పరిధిలో వర్సిటీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఉట్నూరు, ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన వర్సిటీ నెలకొల్పాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో వర్సిటీ ఏర్పాటు ఎక్కడ అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తామని ప్రకటించి.. ఆ మేరకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా వరంగల్‌లో నెలకొల్పుతున్నా.. గిరిజన వర్సిటీపై ఉన్న సందేహాలు తొలగిపోలేదు. ఇటీవల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమావేశంలో తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయం అంశంపై జరిగిన చర్చతో మళ్లీ కదలిక వచ్చింది.
రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి మహేష్‌దత్ ఎక్కా గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు జాకారంలో 169 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే సర్వే నంబర్‌లో సేకరించామని వివరించారు. అదేవిధంగా 213 ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ సమీపంలో ఉందని, దీన్ని సైతం వర్సిటీ కోసం కేటాయించేందుకు ఫారెస్టు అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెంది, వర్సిటీ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు ఫిబ్రవరిలో కేంద్ర అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు పంపేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో గిరిజన విశ్వవిద్యాలయం పనులను పర్యవేక్షించేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నారు. జబల్‌పూర్ గిరిజన వర్సిటీ తరహాలో ములుగులో వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు జబల్‌పూర్‌కు ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు.
వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు
మామునూరులోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కాలేజీలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. ఇప్పటికే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా మామునూరు వెటర్నరీ కాలేజీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు వెటర్నరీ కాలేజీకి అవసరమైన భవనాలు, మౌలిక వసతులు, ల్యాబ్‌ల నిర్మాణం కోసం రూ.109.69 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగింది. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నందున భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment