శివ శివా... | No funds in pedakakani temple | Sakshi
Sakshi News home page

శివ శివా...

Published Tue, May 31 2016 8:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

No funds in pedakakani temple

పెదకాకాని మల్లేశ్వరస్వామికి రావాల్సిన బకాయిలెన్నో?
వ్యాపారులు చెల్లించాల్సింది రూ.1,19,18,444
నోటీసులకూ స్పందన లేదు
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆలయ అధికారులు
 
ప్రసిద్ధిగాంచిన పెదకాకాని శివాలయానికి బాకీదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆలయంలో నిర్వహించే వివిధ షాపులను, హక్కులను టెండర్ల ద్వారా చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు అద్దె సరిగ్గా చెల్లించటం లేదు. దీంతో బకాయిలు  రోజురోజుకూ పెరిగి రూ.కోటి దాటాయి.
 
పెదకాకాని : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, పూలు, కట్టెలు, కూల్‌డ్రింక్స్, చెప్పుల స్టాండ్, గ్యాస్ పొయ్యి అద్దెకు ఇవ్వడం వంటి వాటిపై బహిరంగ వేలం పాటలు జరుగుతుంటాయి. హెచ్చుపాట పాడిన వ్యక్తికి ఆ వ్యాపారం అప్పగిస్తుంటారు.

ఇందుకు వారు దేవస్థానానికి నెలనెలా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.కానీ, కొందరు వ్యాపారులు అద్దెను సరిగ్గా చెల్లించట్లేదు. కొంతకాలంగా వ్యాపారుల మధ్య పోటీ పెరగడం, ఎక్కువ పాటలు పాడి షాపులను దక్కించుకోవడం, దేవస్థానం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి బాకీలు ఉన్న వారికి గానీ, వారి కుటుంబీకులకు గానీ తరువాత జరిగే వేలంపాటలో పాల్గొనే హక్కులేదు. ఇక్కడ ఆ నిబంధన సరిగ్గా అమలు జరగట్లేదు.
 
మొద్దు బకాయిలెన్నో..
దేవస్థాన వ్యాపారులైన బొమ్మిశెట్టి గరటాదేవి రూ.40,11,968, వి.రాజారామ్మోహన్‌రాయ్ రూ.27,90,000, బోడా ప్రసన్న రూ.20,17,200, ఆలా ప్రసాద్‌రావు రూ.5,30,076, యడ్లపల్లి రమేష్ రూ.91,200, సీతంశెట్టి అరుణ రూ.24,48,000 చెల్లించాల్సి ఉంది. ఆలయానికి బాకీ చెల్లించాల్సిన వ్యాపారస్తులకు ముందుగా ఆలయం తరఫున, ఆ తరువాత లాయర్ నోటీసులు అందజేశారు. 2015వ సంవత్సరం, అంతకుముందు కోర్టు ద్వారా ఆలయానికి బాకీలు చెల్లించాలని కోరారు.

బాకీదారుల పేర్లు ఆలయ ప్రాంగణంలో బోర్డుపై ఏర్పాటుచేశారు. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ఒక కాంట్రాక్టర్ ఉండగానే సదరు షాపునకు మూడు నెలల ముందే పాట నిర్వహిస్తారు. ఈ పాటలో షాపు దక్కనివారు (అప్పటికే కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి) ఆ తరువాత మూడు నెలల కాలానికి అద్దె చెల్లించకపోవడం వల్ల ఈ బాకీలు భారీగా పెరిగిపోతున్నాయి.
 
న్యాయస్థానాన్ని ఆశ్రయించాం
ఆలయానికి వ్యాపారస్తులు బాకీలు ఉన్న మాట నిజమే. ముందుగా ఆలయ నోటీసులు జారీ చేశాం. ఆ తరువాత లాయర్ నుంచి డబ్బు చెల్లించాలని నోటీసులు ఇప్పించాం. వ్యాపారస్తుల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బు వసూలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. నోటీసు బోర్డులు రాసిన తరువాత ఇద్దరు చెల్లించారు. కోర్టు ద్వారా మిగిలిన వారి వద్ద కూడా వసూలు చేస్తాం.
 - దార్ల సుబ్బారావు, ఆలయ సహాయ కమిషనర్, పెదకాకాని శివాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement