మూడేళ్లుగా కునారిల్లుతున్న విశ్వవిద్యాలయాలు
సీఎం, డిప్యూటీ సీఎం ఆధిపత్య పోరుతో జాప్యం!
సాక్షి, హైదరాబాద్: పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాల్సిన విశ్వవిద్యాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఏళ్ల తరబడి పాలకమండళ్లే లేక కునారిల్లిపోతున్నాయి. నిర్ణయాలు తీసుకునే వారు.. అభివృద్ధిపై దృష్టి సారించేవారు లేక పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయి. పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని సాక్షాత్తు హైకోర్టు ఆదేశించి మూడేళ్లు అవుతున్నా.. ప్రభుత్వం ఇప్పటికీ నియమించలేదు. కొంతకాలం కింద పాలకమండళ్ల నియామకం కోసం ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. మూడు వర్సిటీల్లో ఈసీలను నియమించగలిగింది. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధిపత్య పోరు కారణంగా.. మరో 19 వర్సిటీల ఈసీల నియామకాలు ఆగిపోయాయి. తాము సూచించిన పేర్లు లేవంటూ జాబితాల్లో మార్పులు చేసి సీఎం సంతకం చేయగా.. తాము సూచించిన పేర్లు లేవంటూ డిప్యూటీ సీఎం సంబంధిత ఫైలును పక్కన పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దానికి మోక్షం లభించేలోగానే రాష్ట్రపతి పాలన వచ్చేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర పాలనలో గవర్నరే కీలకం. పైగా యూనివర్సిటీలకు ఆయనే చాన్స్‌లర్ కూడా. ఈ నేపథ్యంలో పాలకమండళ్లు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలపై గవర్నర్ దృష్టి సారించి, వర్సిటీల పటిష్టతకు చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక చట్టం ఉన్న ఆర్జీయూకేటీ మినహా రాష్ట్రంలో 24 వర్సిటీలున్నాయి. వీటిలో కేవలం ఉస్మానియా, జేఎన్టీయూ-హైదరాబాద్‌లకు మాత్రమే పాలకమండళ్లు ఉన్నాయి. ద్రవిడ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలకు ఇటీవల పాలక మండళ్లను ఏర్పాటు చేశారు.
మిగతా 19 వర్సిటీలకు పాలకమండళ్లు లేవు. 2006 తరువాత ఏర్పడిన 14 కొత్త వర్సిటీల్లో 11 వర్సిటీల పరిస్థితీ ఇదే.
యోగి వేమన, తెలంగాణ, ఆదికవి నన్నయ వర్సిటీల పాలక మండళ్లు పదవీకాలం ముగియడంతో... 2011లోనే ఖాళీ అయ్యాయి. ఈ మూడు వర్సిటీలతోపాటు.. సాంస్కృతిక శాఖ పరిధిలోకి వెళ్లిన తెలుగు వర్సిటీ పాలక మండళ్ల కోసం కనీసం ప్రతిపాదనలుకూడా రూపొందించలేదు.
ప్రతిపాదనలు వెళ్లినా మరో 15 వర్సిటీలకు పాలక మండళ్ల నియామకాలు నేతల ఆధిపత్య పోరులో ఆగిపోయాయి.
పాలక మండళ్లు లేని వర్సిటీలివే
యోగి వేమన (కడప), తెలంగాణ (నిజామాబాద్), ఆదికవి నన్నయ (రాజమండ్రి), తెలుగు వర్సిటీ (హైదరాబాద్), ఆంధ్రా (విశాఖ), శ్రీవేంకటేశ్వర (తిరుపతి), కాకతీయ (వరంగల్), నాగార్జున (గుంటూరు), శ్రీకృష్ణదేవరాయ (అనంతపూర్), శాతవాహన (కరీంనగర్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (శ్రీకాకుళం), కృష్ణా (మచిలీపట్నం), విక్రమసింహపురి (నెల్లూరు), రాయలసీమ (కర్నూలు), జేఎన్‌టీయూ (కాకినాడ), జేఎన్‌టీయూ (అనంతపూర్), జేఎన్‌యూఎఫ్‌ఏ (హైదరాబాద్), బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్), శ్రీపద్మావతి మహిళా వర్సిటీ (తిరుపతి).
3 వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీయే
దాదాపు 20 వర్సిటీలకు మంజూరైన అధ్యాపక పోస్టులు 4,725 కాగా.. వాటిలో 2,157 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 1,151 పోస్టుల్లో తాత్కాలిక సిబ్బంది పనిచేస్తున్నారు. ఆ లెక్కన ఇవి కూడా ఖాళీ పోస్టులే. అత్యధికంగా ఉస్మానియాలో 1,223 పోస్టులకు 617 ఖాళీగా ఉన్నాయి. ఇందులో భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. కాకతీయ, తెలంగాణ వర్సిటీల్లో నియామకాలు చేపట్టినా వివాదాస్పదంగా మారాయి. మిగతా 17వర్సిటీల్లో ఖాళీల భర్తీ నిలిచిపోయింది. కొత్త వర్సిటీలైతే అనాథలుగా మిగిలాయి. కొన్ని విభాగాల్లో ఒక్క అధ్యాపకుడూ లేని దుస్థితి నెలకొంది. వీటితో పాటు 3 జేఎన్‌టీయూల్లో 698 పోస్టులకుగాను 289పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వర్సిటీలకు పాలక మండళ్లేవీ?
Published Mon, Mar 3 2014 1:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement