
హైదరాబాద్ వాసులకు రుణమాఫీ లేదు
* ఆధార్ ఆధారంగా 4 లక్షల మందికి మాఫీ నిరాకరణ
* ఇతర రాష్ట్రాల్లో ఆధార్ ఉందంటూ 9 లక్షల మందికి తిరస్కరణ
* విషయం తెలిసినా పట్టించుకోని ప్రభుత్వం
* చంద్రబాబుపై మండిపడుతున్న రుణ గ్రహీతలు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లోని చిరునామాల్లో ఆధార్ కార్డు ఉందని 9 లక్షల మంది రైతుల ఖాతాలను రుణ విముక్తి నుంచి ప్రభుత్వం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోనే భూమి ఉండి అక్కడి బ్యాంకుల్లోనే రుణం తీసుకున్నప్పటికీ ఆధార్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఉన్నందున స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ 9 లక్షల ఖాతాలను రుణ విముక్తికి అర్హత లేదని తిరస్కరించింది. ఇందులో ఏకంగా నాలుగు లక్షల మంది ఖాతాలు హైదరాబాద్‌లోని వారివే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ దారుల కుటుంబాలకు చెందిన లక్షల మంది వ్యాపారం లేదా జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారు హైదరాబాద్‌లోనే ఆధార్ నంబర్, రేషన్ కార్డు తీసుకున్నారు.
ప్రభుత్వం రుణ విముక్తికి ఆధార్ నంబర్, రేషన్ కార్డులతో ముడిపెట్టిన విషయం తెలిసిందే. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన రైతు కుటుంబాలకు చెందిన వారు జీవనోపాధి నిమిత్తం బెంగళూరులో ఉంటున్నారు. ఇలాగ సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. అక్కడ వారు ఆధార్ నంబర్ తీసుకున్నారు. ఇలాంటి వారిచ్చిన ఆధార్ నంబర్‌ను డేటా హబ్ తిరస్కరించింది. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినప్పటికి పట్టించుకోవడం లేదు. దీనిపై హైదరాబాద్‌లోని ఆంధ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడుతున్నారు. ఎన్నికల ముందు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో తమ కుటుంబాల్లోని అంతా వెళ్లి టీడీపీకి ఓటు వేశామని చెబుతున్నారు.
తగిన శాస్తి చేశారు..
చంద్రబాబు అధికారంలో వచ్చారు కదా అని రుణం చెల్లించడం మానేసానని హైదరాబాద్ నివాసి వెంకట నారాయణ సాక్షికి తెలిపారు. తీరా ఇప్పుడు హైదరాబాద్‌లో ఆధార్, రేషన్ ఉన్నందున రుణ మాఫీకి అనర్హులంటున్నారని, దీంతో రుణాలకు వడ్డీ ఇప్పుడు తడిసిమోపెడైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో కడితే వడ్డీ లేని రుణం వర్తించేదని, అలా కాకపోయినా ఏడు శాతం వడ్డీ పడేదని, ఇప్పుడు 14 శాతం వడ్డీతో పాటు మరో రెండు శాతం ఫైన్‌తో మొత్తం 16 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ. 30 వేలు బ్యాంకుకు కట్టానని చెప్పారు. ఇంకా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగానే ఉందన్నారు. ఆధార్ హైదరాబాద్‌లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాకుండా పోతారా, అలా అయితే చంద్రబాబు ఆధార్ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నపుడు ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదా అంటూ ఆవేదనగా ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆధార్ ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం మోసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు.
ఓట్లు వేసినందుకు చంద్రబాబు సర్కారు తమకు తగిన శాస్తి చేసినట్లుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా.. హైదరాబాద్, బెంగుళూరు, మరో రాష్ట్రంలో నివస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలంటే ఆయా రాష్ట్రాల స్టేట్ రెసిడెంట్ డేటా అందుబాటులో లేదని తెలిపింది. వ్యవసాయ భూమి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నా అక్కడి బ్యాంకుల్లోనే రుణం తీసుకున్నప్పటికీ హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆధార్ ఉన్న వారికి రుణ విముక్తి కల్పించడం సాధ్యం కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాకు స్పష్టం చేశారు.