‘రేషన్‌’ రద్దయిన వారికి మళ్లీ కార్డులు! | Telangana Govt Decision To Re Grant Ration Cards | Sakshi
Sakshi News home page

‘రేషన్‌’ రద్దయిన వారికి మళ్లీ కార్డులు!

Published Fri, Jul 8 2022 12:46 AM | Last Updated on Fri, Jul 8 2022 3:18 PM

Telangana Govt Decision To Re Grant Ration Cards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రేషన్‌కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి.. అర్హులని తేలితే రేషన్‌కార్డులను పునరుద్ధరి స్తారు. రేషన్‌కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ మంగళవారమే మొదలైందని.. ఈ నెల 20 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో..
2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 21.94 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలవడంతో గత ఏప్రిల్‌ 27న విచారణ జరిపింది. లబ్ధిదారులకు కనీస సమాచారం లేకుండా 21.94 లక్షల రేషన్‌కార్డులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. 2016 నాటి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 17 అంశాల్లో పరిశీలన జరిపి, నోటీసులిచ్చి కార్డులు తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

కొందరు రేషన్‌ డీలర్ల దగ్గర 200 నుంచి 300 కార్డులున్నట్టు తేలడంతో తొలగించినట్టు పేర్కొంది. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, కార్డుదారులు తమ అర్హత నిరూపించుకునే అవకాశమివ్వకుండా.. 21 లక్షలకుపైగా రేషన్‌ కార్డులను తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి, æఅర్హులను గుర్తించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్‌ చేపట్టింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

రీవెరిఫికేషన్‌ మార్గదర్శకాలివే..
►రద్దయిన రేషన్‌ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం కోసం వారి డేటాను రేషన్‌షాపుల నుంచి సేకరించాలి.
►ఆ జాబితాలను అన్ని రేషన్‌షాపులు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి.
►రద్దయిన కార్డుదారులకు సంబంధించి తనిఖీ అధికారి సంప్రదించలేని, గుర్తించలేని వారికి నోటీసులను వారి చిరునామాకు పోస్ట్‌ చేయాలి, ఫోన్‌ నంబర్ల ద్వారా  సంప్రదించాలి.
►రీవెరిఫికేషన్‌పై స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేయాలి.
►ఎవరైనా తిరిగి రేషన్‌కార్డు పొందేందుకు అర్హులని తేలితే.. వెంటనే ఆ వివరాలను నమోదు చేయాలి.
►రద్దు చేయబడిన కార్డుకు సంబంధించిన కారణాలను కూడా నమోదు చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement