
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎవరికైతే బ్యాంకు అకౌంటుకు ఆధార్ కార్డు అనుసంధానం లేదో వారికి ఇప్పటికే తపాలా కార్యాలయాల ద్వారా నగదు తీసుకునే వెసులుబాటు కల్పించామని, మొత్తంగా 5.21 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,500 నగదు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇందులో ఇప్పటికే 52 వేల మంది లబ్ధిదారులకు నగదు చెల్లించామని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా జిల్లాల లబ్ధిదారులు నిర్ణయించిన తపాలా కార్యాలయాల నుంచి నగదు తీసుకోవచ్చని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్‌ల పరిధిలో నిర్ణయించిన తపాలా కార్యాలయాల నుంచి రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన లబ్ధిదారులైనా ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న రూ.1,500 సాయాన్ని తీసుకోవచ్చని వివరించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొన్ని తపాలా కార్యాలయాలు చెల్లింపులు తీసుకునేందుకు ఎంపిక చేశామని, వాటిలో జీపీఓ, జూబ్లీ హెడ్ ఆఫీస్, ఫలక్‌నామా, కేశవగిరి, బహదూర్‌పుర, సైదాబాద్, అంబర్‌పేట, ఉప్పల్, కాచిగూడ, రామకృష్ణాపూర్, యాకుత్‌పుర, ఖైరతాబాద్, హుమాయూన్ నగర్, హిమాయత్‌నగర్, మోతీనగర్, ఎస్సార్ నగర్, లింగంపల్లి, శ్రీనగర్ కాలనీ, కొత్తగూడ, మణికొండ, కార్వాన్, సికింద్రాబాద్, తిరుమలగిరి ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాంకు అకౌంటు లేని లబ్ధిదారుల జాబితా సంబంధిత రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంటుందని గంగుల తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో గల వ్యక్తిమాత్రమే నగదు పొందేందుకు అర్హుడని, ఆధార్, రేషన్ కార్డు నంబర్ నగదు ఉపసంహరణకు అవసరమని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment