సాక్షి,కడప: బడ్జెట్ కేటాయింపులు ఘనంగా ఉన్నా... వాటిని ఖర్చు చేయడంలో వివిధ శాఖలు నీరసించి పోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నేడో రేపో ఫ్రీజింగ్ వదంతుల నేపథ్యంలో మార్చిలోపు నిధులు ఖర్చు కావడం గగనమేనని పలు శాఖల అధికారులు పేర్కొంటున్నారు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయితే కొత్తగా నిధుల విడుదల కోసం అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉండదు.
జిల్లాకు ఈఏడాది రూ. 610.42 కోట్ల నిధులు 14 ట్రెజరీల వారీగా మంజూరయ్యాయి. సరాసరిన నెలకు దాదాపు రూ. 50 కోట్ల మేర నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. మార్చిలోపు అంటే నెలలో రూ. 145 కోట్ల నిధులు ఖర్చు కావడం అసంభవమని పలుశాఖల అధికారులు పేర్కొం టున్నారు. ఇందులో ఎక్కువ శాతం నిధులు మురిగి పోయే అవకాశం ఉందన్నారు.
వివిధ శాఖల్లో మిగిలిన నిధులు:
జిల్లాలో ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, ఐసీడీఎస్,వైద్య,వ్యవపాయ,రెవిన్యూ శాఖలో నిధులు మిగిలి ఉన్నాయి. ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖలో రూ. 7.26 కోట్లు, బీసీ సంక్షేమ శాఖలో రూ. 34.25 కోట్లు, గిరిజన శాఖలో రూ. 1.22 కోట్లు,మైనార్టీ శాఖలో రూ. 83.32 లక్షలు, ఆత్మ,హర్టికల్చరల్ శాఖలో రూ. 2.9 కోట్లు,పశు సంవర్థక శాఖలో రూ. 1.26 కోట్లు,విద్యాశాఖలో రూ. 3కోట్లు,ఐసీడీఎస్‌లో రూ 5.28 కోట్లతో పాటు రెవిన్యూ శాఖకు సంబంధించి ఎన్నికల, విపత్తు నిధులు ఖర్చు కాకుండా ఉన్నాయి. వీటిలో విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధులు కూడా ఉన్నాయి.
సరాసరిన నెలకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. మిగిలిన నెలలోపు రూ. 145 కోట్లు ఖర్చు కావడం గగనమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఖర్చు కాక పోతే నిధులు మురిగి పోయే అవకాశం ఉంది.
ట్రెజరీల వారిగా కేటాయింపులు...
కడప హుజూరు ట్రెజరీకి రూ. 447.54 లక్షలు కేటాయించగా ఇందులో రూ. 113 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయి. బద్వేలు ట్రెజరీలో రూ. 17.37 కోట్లకు గాను రూ. 33.03 లక్షలు, జమ్మలమడుగులో రూ.76.16లక్షలకు రూ. 18.30 లక్షలు,కమలాపురం ట్రెజరీలోరూ. 11.28 కోట్లకు రూ. 1.68 కోట్లు,లక్కిరెడ్డి పల్లె ట్రెజరీలో రూ. 94.70 లక్షలకు రూ. 25.16 లక్షలు, ముద్దనూరు ట్రెజరీలో రూ. 48.24లక్షలకు రూ. 9.67లక్షలు, ప్రొద్దుటూరు ట్రెజరీలో రూ. 2.57కోట్లకు గానూ రూ. 51.30లక్షలు, పులివెందుల ట్రెజరీలో రూ. 2.31కోట్లకు గానూ రూ. 54.396లక్షలు మిగిలి ఉన్నాయి.
రైల్వేకోడూరు ట్రెజరీలో రూ. 1.12కోట్లకు గానూ రూ. 23.79లక్షలు, రాజంపేట ట్రెజరీకి సంబంధించి రూ. 78.69లక్షలకు గానూ రూ. 18.29లక్షలు, రాయచోటి ట్రెజరీకి సంబంధించి రూ. 1.48కోట్లకు గానూ రూ. 29.41లక్షలు, సిద్ధవటం ట్రెజరీలో రూ. 1.48 కోట్లకు రూ. 15.23 లక్షలు, మైదుకూరు ట్రెజరీకి సంబంధించి రూ. 1.60కోట్లకు గానూ రూ. 20.99లక్షలు, కడప ఎస్‌టీఓకు సంబంధించి రూ. 84,026లకు గానూ రూ. 13,444 నిధులు మిగిలి ఉండటం గమనార్హం. ఈ నిధులన్నీ మార్చిలోపు ఖర్చు కావాల్సి ఉంది.
ఆంక్షలు లేవు..
బిల్లుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వివిధ శాఖల నుంచి అందిన బిల్లులకు నిధులను వెంటనే మంజూరు చేస్తున్నాం. - రంగయ్య, ఖజాన ఉప సంచాలకులు.
గండం
Published Fri, Feb 28 2014 2:34 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement