సిగ్నలే కరువు.. ఇ​క ఇంటర్నెట్‌ గతేంటో..? | No Network In Polling Centres Of Chittoor | Sakshi
Sakshi News home page

సిగ్నలే కరువు.. ఇ​క ఇంటర్నెట్‌ గతేంటో..?

Published Wed, Mar 13 2019 2:59 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

No Network In Polling Centres Of Chittoor - Sakshi

చిత్తూరు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసు

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ : ఎన్నికల నిర్వహణలో పారదర్శక, వేగవంతమైన నిర్ణయాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అవసరం. అయితే సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో అతి ముఖ్యమైన ఇంటర్నెట్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందా? తాత్కాలికంగా అయినా అందించడానికి, బీఎస్‌ఎన్‌ఎల్, ఇతర ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం లేదు. జిల్లాలోని వందలాది గ్రామాల్లో ఇంటర్నెట్‌ లేని మాట అటు ఉంచితే సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయంతో పనిచేసే పరికరాలను ఏ విధంగా వినియోగిస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి.

అందుబాటులో లేని బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు

ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్‌ బీఎస్‌ఎన్‌ఎ ల్‌ 3జీ సేవలు జిల్లావాసులకు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో రాని దుస్థితి నెలకొంది. దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తున్నా ఈ సేవలను జిల్లా మొత్తానికి అందించడానికి వెనుకబడ్డారు. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని కాట్నగల్లు, గొల్లపల్లె, నిలువరాతిపల్లె, బాగేపల్లె, కమ్మచెరువు, చెట్లవాండ్లప ల్లె ప్రాంతాల్లో 3జీ సేవలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ నేటికీ అందడం లేదు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని మరికొన్ని సరిహద్దు మండలాల్లోని గ్రామాల్లో ఉంది. బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్న ప్రాంతంలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంటున్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) పర్యవేక్షణ, నిర్వహణ వైఫల్యాలతో అది కూడా అంతంతగానే ఉంది. చిన్నపాటి మరమ్మతులను రోజుల తరబడి చేయడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యధికంగా, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు సంస్థ అందిస్తున్న అంతర్జాల సేవలు విసుగు పుట్టిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వినియోగానికి అనుగుణంగా అధునాతన మార్పులు తేవడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనుకబాటుతనం కనిపిస్తోంది. సాంకేతిక వినియోగంతో ఎన్నికల నిర్వహణను సంతృప్తికరంగా పూర్తి చేయాలని భావిస్తున్న జిల్లా యంత్రాంగానికి ఫోన్‌ సిగ్నల్స్‌ సమస్యలతోపాటు, ఇంటర్నెట్‌ సమస్యలు తప్పకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

వెబ్‌కాస్టింగ్‌కు ఆదేశాలు

గతంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన వెబ్‌కాస్టింగ్‌ సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించాలని ఆదేశాలందాయి. ఈ ప్రక్రియలో కంప్యూటర్ల ను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్లతో పోలింగ్‌ నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పరిశీ లించడానికి, రికార్డు చేయడం వీలవుతుంది. ఎక్కడైనా ఇబ్బందికరమైన ఘటనలు తలెత్తితే కంట్రోల్‌ రూమ్‌ నుంచి వేగంగా స్పందించడానికి ఉపయోగపడుతుంది. సాంకేతిక అంశాలపై పట్టు ఉన్న విద్యార్థుల సహకారాన్ని గతంలో తీసుకున్నారు. అయితే ఈసారి ఎలా నిర్వహించనున్నారో తెలియని పరిస్థితి.

స్పష్టత కరువు

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే సమాచారాన్ని జిల్లా యంత్రాగానికి ఎలా చేరవేస్తారన్న విషయంలో స్ప ష్టత లేకుంటే కష్టమే. వైర్‌లెస్‌ సెట్ల వినియోగం స మాచారాన్ని చేరవడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయాన్ని పునఃసమీక్షించుకోవాల్సినవసరం ఎంతైనా ఉంది. తీవ్రతను తెలిపేలా ఫొటోలు, వీడియోలు, డ్యాకుమెంట్లు పంపే విషయంలో ఇ బ్బందులు తప్పకపోవచ్చు. వెబ్‌కాస్టింగ్‌ విషయంలో ఇంటర్నెట్‌ అవసరమే కీలకమనే విషయాన్ని జి ల్లా యంత్రాంగం గుర్తించాల్సి ఉంది. దీంతోపాటు ఎంతమంది పోలింగ్‌ సిబ్బందికి వైర్‌లెస్‌ సెట్ల విని యోగంపై అవగాహన ఉందనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏదీ ఏమైనప్పటికీ కనీసం ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా లేని ప్రాంతాల్లో వి«ధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి ఇబ్బందిగా మారుతుంద న్న విషయాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.

జిల్లాలో నెట్‌వర్క్‌ పరిస్థితి ఇదీ..

జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. నెట్‌ను అందించడంలో ప్రధాన పాత్ర పోషించే ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ తెగిపోతుండడం సమస్యగా మారుతోంది. దీంతో సిగ్నల్స్‌ సమస్య అధికమవుతోంది.

జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు అందుబాటులో లేవు. త్వరలో జరిగే ఎన్నికలకు 95 శాతం ప్రభుత్వ పాఠశాలలే పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. ఈ సందర్భంలో సమస్య ఉత్పన్నమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైస్పీడ్‌ ఇంటర్నెట్, బ్రాండ్‌బ్యాండ్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఎలా అనుసంధానిస్తారన్న అంశంపై స్పష్టత లోపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement