దొడ్డారెడ్డి శంకర్‌రెడ్డి, మురళీ రెడ్డిలను వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానిస్తున్న ఆ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పక్కన కరుణాకరరెడ్డి
సాక్షి, తిరుపతి సెంట్రల్: తిరుపతిలో వైఎస్సార్‌సీపీకి రోజురోజుకీ వలసలు పెరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ జోరుకు తిరుగులేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ఒకవైపు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి అన్ని వర్గాల ప్రజలు, నేతలను కలుపుకుంటూ, భరోసా ఇస్తుండడంతో ఆ పార్టీ వైపు అంతా ఆకర్షితులవుతున్నారు. మరోవైపు యువనేత భూమన అభినయ్ పరిణితిని ప్రదర్శిస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతుండడం ఆ పార్టీకి అదనపు బలంగా మారింది. ఈ ఫలితం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. కరుడు గట్టిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ప్రత్యేకించి బలిజ,కాపు, యాదవ సామాజిక వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గాల నేతలందరిదీ అదే వరస అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చి చేరుతున్న వారి సంఖ్యతో ఆ పార్టీ గ్రాఫ్ పైపైకి ఎగబాకుతూనే ఉంది.
వారం రోజుల వ్యవధిలోనే ఆ రెండు పార్టీల్లో ద్వితీయ శ్రేణి నేతలు దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. కాపు, బలిజ సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ముద్ర నారాయణ, దుద్దేల బాబు వంటి సీనియర్లు తొలి నుంచి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ విద్యావేత్త కేఎం కృష్ణయ్య మనవడు కేఎంకే కిరణ్ రాయల్, ఎన్వీ సురేష్, చందు రాయల్, చెరకుల వెంకటేష్ , రోహిత్, గిరి,మణి, తిరుమలయ్య వంటి ద్వితీయ,తృతీయ శ్రేణి నాయకులు, తిరుమల స్థానికులు చేరారు. అనంతవీధిలో కాపు, బలిజ సామాజిక వర్గాల ప్రజలు మొదటి నుంచి టీడీపీ సంప్రదాయ ఓటర్లుగా ముద్ర ఉంటే..తాజగా సార్వత్రిక ఎన్నికల్లో ఆ ముద్రను చెరిపేస్తామని, వైఎస్సార్‌సీపీకే ఓట్లేస్తామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశంలో మహిళ సంఘాలకు ప్రాతినిథ్యం వహించిన పద్మ, అనసూయ, అరుణ, రాధామాధవి, మధుబాల, విజయలక్షి, విజయశాంతి వంటి వారుకూడా ఇటీవలే వైఎస్సార్‌సీపీ జెండాను భుజానకెత్తుకున్నారు. కాపు, ఉద్యమ కమిటీ నేత పోకల అశోక్ తన వంతు పార్టీ కోసం కృషి చేస్తున్నారు.
టీడీపీకీ వరుస షాక్‌లు
యాదవ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు కామాటి వరదరాజులు, కుడితి సుబ్రమణ్యం, తాళ్లపాక గోపాల్‌తో పాటు టౌన్ బ్యాంక్ మాజీ డైరక్టర్ జెల్లి తులసీ ఇటీవలే వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన బీసీ సంఘాల సమాఖ్య జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణయ్య తాజాగా పార్టీలో చేరడంతో టీడీపీకి పెద్ద దెబ్బతగిలింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తిరుపతిలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీని యాదవ సామాజిక వర్గాలు దూరమయ్యాయి. దీనికితోడు టీడీపీలో యాదవ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందని యాదవ సామాజిక వర్గాలు గుర్రుగా ఉన్నాయి. టీడీపీలో కీలకంగా పనిచేసిన దొడ్డారెడ్డి శంకర్‌రెడ్డి, ఆచార్యా ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయ పాలకమండలి సభ్యుడు మురళీరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు లడ్డూ భాస్కర్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి వంటి నేతలు చేరడంతో వైఎస్సార్‌సీపీకి మరింత బలం పుంజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment