బాబే జిల్లాకు శాపం | Rayalaseema Intellectual Forum Co-Ordinator M.Purushotham Reddy Interview | Sakshi
Sakshi News home page

బాబే జిల్లాకు శాపం

Published Wed, Mar 13 2019 4:47 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Rayalaseema Intellectual Forum Co-Ordinator M.Purushotham Reddy Interview - Sakshi

ఎం.పురుషోత్తంరెడ్డి

ముఖ్యమంత్రి జిల్లా అంటే రాష్ట్రానికే మార్గదర్శకంగా ఉండాలి. ప్రగతి పథంలో దూసుకుపోవాలి. ఆర్థికంగా బలోపేతం కావాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబునాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫలితం లేకుండాపోయింది. ఆయన పాలన జిల్లాకు శాపంగా మారింది. తీరని కష్టనష్టాలే మిగిలాయి. వచ్చిన ప్రాజెక్టులకు నిధులు వెచ్చించక అటకెక్కించారు. ఉన్న ప్రాజెక్టులను సొంత ప్రయోజనాల కోసం మూయించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసబాట పడుతున్నారు. టీటీడీలో ఉద్యోగాల ప్రకటన గాలికొదిలేశారు. జన్మనిచ్చిన మాతృభూమికి తీరని ద్రోహం చేశారు’ అని రాయలసీమ మేధావుల ఫోరం కో–ఆర్డినేటర్‌ ఎం.పురుషోత్తంరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం తీరును ఎండగట్టారు.  


ప్ర: సహకార మాట ఎలా ఉంది?

జ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ సంస్థపై పడ్డారు. ఎక్కడా లేనివిధంగా జిల్లాలోని విజయడెయిరీ, చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీని దశలవారీగా మూయించి రైతాంగానికి తీరని అన్యాయం చేశారు. ఈ రెండు జిల్లాలో ఉండి ఉంటే రైతులకు మంచి చేకూరేది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారోలేదు గాజులమండ్యం షుగర్‌ ఫ్యాక్టరీ కూడా మూత పడేదిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త వాటిని ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటిని కుట్రపూరితంగా మూతవేయించి, ప్రైవేటు వ్యవస్థను పురమాయించారు. వైఎస్‌ జగన్‌తో మరోసారి సహకార వ్యవస్థపై జిల్లా ప్రజల్లో చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తానే మూతపడిన సహకార వ్యవస్థను తెరిపిస్తానని మాట ఇచ్చారు. జగన్‌ వస్తే పాడి, వ్యవసాయ రంగం విరాజిల్లుతుందనే సంతోషంలో ప్రజలు ఉన్నారు.

ప్ర: టీటీడీలో జిల్లా వాసుల హక్కులను కాలరాసిదెవరు?

జ: జిల్లాకు చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు 14 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ 14 ఏళ్లలో టీటీడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏడాది కాలం పాటు సీఎం పదవిలో ఉన్న రోశయ్య హయాంలో టీటీడీలో ఉద్యోగాలు భర్తీ చేశారు. 8 వేల ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే అందులో 85 శాతం ఉద్యోగాలు జిల్లా వాసులకు దక్కేవి. ఇది చాలక ప్రజలు మన్నించని అతిపెద్ద తప్పిదానికి చంద్రబాబు నడుం బిగించారు. టీటీడీ ఉద్యోగాల భర్తీ 85 శాతం లోకల్‌గా జిల్లా వాసులకే దక్కేవి. చంద్రబాబు తొలి దఫా ముఖ్యమంత్రి అయిన రోజుల్లో రాయలసీమను లోకల్‌గా తీసుకొచ్చి ఉగ్యోగాల భర్తీలో జిల్లాకు తీరని అన్యాయం చేశారు. అంతటితో ఆగకుండా ఇటీవల రాయలసీమకు మరింత తీరని ద్రోహం చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. మెమో నంబర్‌ 49479ని తీసుకొచ్చి టీటీడీ ఉద్యోగాల భర్తీలో రాష్ట్రం మొత్తం ( 13 జిల్లాలు) లోకల్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైనా టీటీడీ ఉద్యోగాలను భర్తీ చేస్తే జిల్లా, సీమవాసులు లోకల్‌ స్థానాన్ని కోల్పోయేలా కుట్ర చేశారు. స్థానికత లేకుండా రాష్ట్రం మొత్తం లోకల్‌ పరిధిలోకి తీసుకువచ్చి జన్మనిచ్చిన మాతృభూమికి తీరని నమ్మక ద్రోహం చేశారు. సీఎం వివక్ష కారణంగా దీనిపై స్థానికులు పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది.

ప్ర: ప్రాజెక్టుల ప్రగతి ఎలా ఉందంటారు?

జ: అనేక రాష్ట్రాలతో పోట్లాడి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీసిటీని జిల్లాకు తీసుకొచ్చారు. అలాంటి శ్రీసిటీని విచ్ఛిన్నం చేసిన ఘనుడు చంద్రబాబు. అంతటితో ఆగకుండా శ్రీసిటీ హక్కులను జిల్లాకు దూరం చేస్తూ ఎక్కడో ఉన్న నెల్లూరు పరిధిలోకి తీసుకెళ్లి జిల్లాకు తీరని నష్టం చేకూర్చారు. నెల్లూరు టీడీపీ నేతలకు తలొగ్గిన చంద్రబాబు జిల్లా భూభాగంలోని శ్రీసిటీని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థలో కలిపేశారు. అలానే మన్నవరం, దుగరాజ పట్నం ప్రాజెక్టుల కోసం పోరాటం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదలయినా కేవలం వైఎస్‌కు మంచి పేరువస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో వీటిని నిర్లక్ష్యంచేశారు. ఐదేళ్లలో పూర్తి కావాల్సిన ఈ భారీ ప్రాజెక్టులను అన్యాయంగా అడ్డుకున్నారు.

ప్ర: హెచ్‌సీఎల్‌ రాకుండా అడ్డుకున్నారట?

జ: హెచ్‌సీఎల్‌ జిల్లాలో ఏర్పాటై ఉండి ఉంటే టీటీడీ తరువాత మరో అతిపెద్ద సంస్థగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థిక సంస్థగా విరాజిల్లేది. ఈ సంస్థను తిరుపతిలో ఏర్పాటు కాకుండా అమరావతికి తరలించి జిల్లా వాసులను నిలువునా మోసం చేశారు. వేల కోట్ల ఈ ప్రాజెక్టును విజయవాడలో ఏర్పాటు చేయాలని అక్కడి నేతల ఒత్తిడి మేరకు చంద్రబాబు తలొగ్గి ఇంతటి ద్రోహానికి ఒడిగట్టారు. హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ శివనాడార్‌ తిరుపతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతూ ఏకంగా ప్రకటన కూడా చేశారు. ఏకంగా చైర్మన్‌ను తప్పుపట్టి ఈ ప్రాజెక్టును జిల్లాకురాకుండా అడ్డుకోవడం నీచాతి నీచం.

ప్ర: నీటి కేటాయింపులను చట్టపరం చేస్తారా?

జ: పట్టిసీమను ఏడాదిలో కట్టానని చెప్పుకునే చంద్రబాబు జన్మనిచ్చిన ఈ గడ్డలో ఏళ్ల తరబడి నీటి అవసరాల కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఎందుకు ఏమీ కట్టలేకపోయారు. 230 కిలో మీటర్ల పనులు వైఎస్‌ హయాంలో పూర్తి చేసిన హంద్రీ–నీవాను మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఐదేళ్లుగా నాన్చుతూ వచ్చారు. గాలేరి–నగరి డిజైన్లు మార్చుతూ కాలయాపన ఎందుకు చేస్తున్నారో, పట్టిసీమ తరహాలో ఏడాదిలో ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చంద్రబాబు చెప్పాలి. హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచకుండా, నీటి కేటాయింపుల్లో చట్టపరంగా వాటా తీసుకురాకుండా సీమకు నీళ్లు ఇచ్చామంటే ఇక్కడ ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని గుర్తించాలి. సీమ, జిల్లాపై ప్రేమ ఉంటే నీటి కేటాయింపులను చట్టపరం ఎందుకు చేయలేదో చెప్పాలి. కేంద్ర నాబార్డు సంస్థ జిల్లా నీటి అవరాల కోసం కండలేరు రిజర్వాయర్‌ నిర్మాణం కోసం రూ.7 కోట్లు కేటాయిస్తే నెల్లూరు జిల్లా నేతల ఒత్తిడి కారణంగా ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాకు చంద్రబాబు చేసిన కుట్ర, ధగా ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రబాబు జిల్లాకు  ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును తీసుకొచ్చి న దాఖలాలు లేవు.

ప్ర: బాబు పాలనపై మీ అభిప్రాయం

జ: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన జిల్లా ప్రజలకు శాపమనే చెప్పాలి. ఎక్కడై నా ఓ వ్యక్తి సీఎం లాంటి ఉన్నత పదవిలో ఉంటే ఆ.. ప్రాంతంగానీ, ఆ ఊరుగానీ అభి వృద్ధితో పాటు అన్నిరంగాల్లో అగ్రస్థా నంలో ఉంటుంది. అయితే చిత్తూరు జిల్లాకు వచ్చే సరికి ఆ పాలన శాపంగా మారింది. జిల్లాకు చెందిన చంద్రబాబుకు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇన్నాళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిందిపోయి తీరని అన్యాయం చేశారు. సహకార వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. జిల్లాకు కేటాయించిన అనేక ప్రాజెక్టులను మరో ప్రాంతానికి తరలించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జిల్లాకు దక్కాల్సిన హక్కులు, వాటాలు, ప్రాజెక్టులు దక్కకపోగా ఉద్యోగాలు సైతం కోల్పోవాల్సిన దుస్థితి ఎదురుకావడం సిగ్గుచేటు. ఉన్న ప్రాజెక్టులను అటకెక్కించగా మంజూరైన వాటిని మరో ప్రాంతానికి తరలించిన చర్రిత  చంద్రబాబుదని రాయలసీయ మేధావుల ఫోరం కో–ఆర్డినేటర్‌ ఎం.పురుషోత్తంరెడ్డి ధజ్వమెత్తారు. చంద్రబాబు వల్ల జిల్లాకు జరిగిన నష్టం, చేసిన తప్పిదంపై ఆయన మండిపడ్డారు.

ప్ర: మెడికల్‌ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటారు నిజమేనా?

జ: స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న పద్మావతి మెడికల్‌ కళాశాలలో మెడికల్‌ సీట్ల విషయంలోనూ జిల్లాకు నష్టం చేకూరేలా చంద్రబాబు కుట్ర చేశారు. ఎíస్వీ యూనివర్సిటీ పరిధిలో మెడికల్‌ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఆంధ్రావర్సిటీ పరిధిలోని మెడికల్‌ సీట్లను 85 శాతం అక్క డి విద్యార్థులకే కేటాయిస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు రాష్ట్రం మొత్తం లోకల్‌ పరిధిలోకి తీసుకొచ్చి మూడో కంటికి తెలియకుండా దొడ్డిదారిన తీసుకొచ్చిన జీఓతో మెడికల్‌ సీట్లు భర్తీ చేసి మూడు జిల్లాల విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఆపై న్యాయస్థానంలో పోరాడి మన హక్కులను సాధించుకుని రెండో ఏడాది నుంచి రావాల్సిన సీట్లను సాధించుకున్నాం.

క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌నూ అడ్డుకున్నాడు..

ముంబైలో తప్ప మరెక్కడా లేని జాతీయ క్యాన్సర్‌ పరిశోధన కేంద్రం యూపీఏ హయాంలో తిరుపతికి మంజూరైంది. 2014లో కేంద్రమంత్రి జైరాం రమేష్‌ శంకుస్థాపన చేసిన క్యాన్సర్‌ పరిశోధన కేంద్రాన్ని చంద్రబాబు అమరావతికి తరలించి జిల్లా ప్రజలను వంచించారు. చరిత్ర హీనుడుగా మిగిలిపోయారు. ఈ పరిశోధనా కేంద్రం ఇక్కడ ఏర్పాటై ఉండి ఉంటేæ అనుబంధంగా మరిన్ని సంస్థలు వచ్చుండేవి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement