
'పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'
విశాఖపట్నం : పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే మాజీ పీసీసీ చీఫ్ బోత్స సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు విధించిందని ఆయన తెలిపారు. శుక్రవారం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రఘువీరా విలేకర్లతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇతర పార్టీల్లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు తమ పార్టీ చేయలేదని రఘువీరా వెల్లడించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బొత్స సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేసింది.