ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదు
నంద్యాల ఓటమిపై పీసీసీ భేటీలో చర్చ
సమావేశానికి హాజరైన దిగ్విజయ్‌సింగ్
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఘోర పరాజయంపై వాడివేడి చర్చ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ కొంతమేరకైనా బలపడకపోతే ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
కాగా, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘోర ఓటమిపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దిగ్విజయ్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యనేతల్ని ఢిల్లీకి రావాలని ఆయన సూచించినట్టు సమాచారం. నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఓటమికి నైతికి బాధ్యత తనదేనని రఘువీరారెడ్డి అన్నట్లు సమాచారం. ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాల పేరిట అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు ప్రతి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పేదలకు ఇందిరమ్మ హయాంలో అందించిన ఫలాల గురించి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు.
అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు వీలుగా అక్టోబర్ 2 నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్తామని చెప్పారు. నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు ఎన్నికలే కావని, అవి పూర్తిగా అనైతికంగా జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ, అనుబంధాల సంఘాల ఎన్నికల ప్రక్రియ 80 శాతం పూర్తయిందని, పీసీసీ చీఫ్‌తోపాటు మిగిలిన పదవులకు ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు కేవీపీ రామచంద్రారావు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సి.రామచంద్రయ్య, కమలమ్మ, కాసు వెంకటకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.