దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
విజయవాడ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మృతి చెంది ఏడాది గడిచినా ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ విషయంలో న్యాయం జరిగేవరకు తమ పార్టీ పోరాడుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా వాసి అయిన రోహిత్ మరణంపై టీడీపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని చెప్పారు.
రోహిత్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠిన చట్టాలు ఉన్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వైఖరి ప్రభుత్వాలకు దళితులపై ఉన్న చిత్తశుద్దికి అద్దం పడుతుందన్నారు. రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని అంటూ.. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కేసును తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. రోహిత్ వేముల చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు.