
బిల్లు కట్టలేదని పంచాయతీకి కరెంట్ కట్
పోరుమామిళ్ల, న్యూస్‌లైన్: పోరుమామిళ్ల గ్రామపంచాయతీ విద్యుత్ బిల్లు చెల్లించలేదని ట్రాన్స్‌కో ఏఈఈ నరసింహారెడ్డి బుధవారం పంచాయతీకి సరఫరా నిలిపివేశారు.
రాత్రి వీధిలైట్ల కనెక్షన్ తీసివేస్తామని, రెండురోజుల్లో చెల్లించకుంటే నీటిపథకాలకు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. పంచాయతీ నుంచి రూ. 55 లక్షలు రావాల్సి వుందన్నారు. అలాగే మండలంలోని మైనర్‌పంచాయతీల నుంచి రూ. 1.20 కోట్లు బకాయి రావాల్సి వుందని, వారు చెల్లించకపోతే అక్కడ కూడా సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంపట్ల సర్పంచ్ హబీబున్నీసా మాట్లాడుతూ ఆగస్టులో తాను పదవి చేపట్టేనాటికి రూ. 57 లక్షలు విద్యుత్ బకాయి ఉందన్నారు.
పంచాయతీలో పైసా కూడా లేకుండా పాతపాలకవర్గం ఊడ్చేసిందన్నారు. అదేసమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవడంతో పాలన స్థంభించిందని, పంచాయతీలో ఆదాయం లేకుండా పోయిందన్నారు. అలాంటి పరిస్థితిలో రెండుదఫాలుగా రూ. 4 లక్షలు విద్యుత్‌బిల్లు చెల్లించామన్నారు. ఎప్పటినుండో పేరుకుపోయిన బకాయిలు మాపై రుద్దడం ఎంతవరకు సబబన్నారు? తాను పదవి చేపట్టాక వినియోగించిన విద్యుత్‌బిల్లు చెల్లించడానికి సిద్దమేనన్నారు.
ఇది కక్ష్యపూరితం: నాగార్జునరెడ్డి
పోరుమామిళ్లలో వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై అధికారపార్టీ అధికారులద్వారా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని వైఎస్‌ఆర్‌సీపీ నేత,మాజీ జడ్పీటీసీ నాగార్జునరెడ్డి ఆరోపించారు.
డీఈతో చర్చలు
విద్యుత్ నిలిపివేయడంపై వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ ఇమామ్‌హుసేన్, నేతలు నాగార్జునరెడ్డి, వసంతరాయలు, బాషాలు ట్రాన్స్‌కో డీఈ పురుషోత్తంతో మాట్లాడారు. రెండురోజుల్లో రూ. లక్ష చెల్లించేందుకు అంగీకరించారు. నెలనెలా రూ. లక్ష చెల్లించడం జరుగుతుందన్నారు.