.
ట్యూషన్ ఉంటే ట్యూటర్ రారు.. చదువుదామంటే
పుస్తకాలుండవు.. చదివీ చదివీ నీరసించినా సరైన
ఆహారం ఉండదు.. ఇవీ ప్రభుత్వ వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థుల పాట్లు. పేదోళ్ల బిడ్డలు పెద్ద చదువులు చదవాలని.. పదో తరగతిలోనే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని.. వారికి మంచి ఆహారం అందించి ప్రైవేటు క్లాసులు చెప్పాలన్న కనీస బాధ్యతలు ప్రభుత్వ వసతి గృహాల్లో సక్రమంగా అమలుకావడం లేదు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులు పడుతున్న పాట్లపై సమరం సాగించేందుకు ‘సాక్షి’ నడుం కట్టింది. విద్యార్థులు పడుతున్న అవస్థలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సాక్షి బృందం పరిశీలన చేసింది. ప్రధానంగా టెన్త్ విద్యార్థులకు పౌష్టికాహారం, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రైవేటు క్లాసులు వంటివి సక్రమంగా అమలు కావడంలేదన్న సంగతి తేటతెల్లమైంది.
సాక్షి, మచిలీపట్నం :
జిల్లాలోని 43 ఎస్సీ హాస్టళ్లలో 1,021 మంది పదో తరగతి విద్యార్థులకు 172 మంది ట్యూటర్లు ఉన్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ డి.మధుసూదనరావు చెప్పారు. 62 బీసీ వసతి గృహాల్లో 758 మంది పదో తరగతి విద్యార్థులకు 99 మంది ట్యూటర్లు ఉన్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ఎం.చినబాబు తెలిపారు. వాస్తవంగా వసతి గృహాల్లో పేరుకే ట్యూషన్లు ఉన్నాయి. చాలాచోట్ల ట్యూటర్లు లేరు. ఉన్నా సకాలంలో రారు. వారికి ఇచ్చే నెలవారీ ట్యూషన్ ఫీజు సరిపోకవడంతో వాళ్లు కూడా వసతి గృహాల్లో ట్యూషన్ చెప్పేందుకు మొక్కుబడిగానే వస్తున్నారు. చాలా హాస్టళ్లలో ట్యూటర్లు రాకపోవడంతో బాలికలు సైతం రాత్రివేళ బయట ప్రాంతాలకు ప్రైవేటు క్లాసులకు వెళ్లిరావడం, అదీ సొంతంగా ప్రైవేటు ఫీజులు చెల్లించాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది.
మొక్కుబడిగా ‘ప్రైవేటు’ క్లాసులు...
వసతి గృహాల్లో చదివే పదో తరగతి -
విద్యార్థులకు ప్రైవేటు క్లాసుల నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. హాస్టళ్లలో ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు లెక్కలు, సైన్స్ సబ్జెక్టులపై రెండు క్లాసులు, సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఇంగ్లిష్, హిందీ రెండు క్లాసులు చెప్పాలి. సబ్జెక్టుకు ఒకరు చొప్పున నలుగురు టీచర్లు ఉండాలి. ఇందుకోసం ఒక్కొక్కరికి నెలకు రూ.500 ట్యూషన్ ఫీజు ఇస్తారు. ఇటీవల దీనిని నెలకు రూ.1600 చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా అది అమల్లోకి రాలేదు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు హాస్టళ్లలో ట్యూటర్లుగా వస్తున్నారు. ట్యూషన్ల విషయంలో వసతి గృహాల నిర్వాహకులు శ్రద్ధ చూపకపోవడంతో అవి మొక్కుబడిగానే జరుగుతున్నాయి.
ఉత్తీర్ణత శాతంపై నీలినీడలు...
ఈ ఏడాది అనేక అవాంతరాల నడుమ సాగుతున్న చదువులతో పదో తరగతి ఉత్తీర్ణతపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. సమైక్య ఉద్యమంతో పాఠశాలలు మూతబడి చదువులు సాగలేదు. పోనీ వసతి గృహాల్లోనైనా ప్రైవేటు క్లాసులు సక్రమంగా సాగుతున్నాయా అంటే అదీ లేదు. గత ఏడాది కాలంగా వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వడంలేదు. జిల్లా విద్యాశాఖ తయారుచేసిన స్టడీ మెటీరియల్‌ను అందించి సరిపెడుతున్నారు. గత మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం పరిశీలిస్తే ఎస్సీ హాస్టళ్లలో 2011లో 96.14 శాతం, 2012లో 83 శాతం, 2013లో 91.05 శాతం సాధించారు. బీసీ హాస్టళ్లలో 2011లో 94.6 శాతం, 2012లో 93.76 శాతం, 2013లో 95.79 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత శ్రద్ధ చేయకపోతే వసతి గృహాల్లో ఉత్తీర్ణత శాతం పడిపోయే ప్రమాదముందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు.
అరటి పండు లేదు.. పాలు ఇవ్వరు...
ప్రభుత్వ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులు ఎక్కువ సమయం చదవడం వల్ల నీరసించకుండా వారికి పౌష్టికాహారం అందించాల్సి ఉంది. వసతి గృహాల్లో పెట్టే రెండు పూటల భోజనంతో పాటు అదనంగా వారికి రాత్రి చదువుకునే సమయంలో అరటి పండు, వేరుశెనగతో చేసిన ఆహారం, బిస్కెట్లు తదితర స్నాక్స్‌తో పాటు పాలు కూడా ఇవ్వాలి. చాలా వసతి గృహాల్లో అందరు విద్యార్థులతో పాటు అరకొర భోజనం మినహా ప్రత్యేకమైన పౌష్టికాహారం ఇవ్వడం లేదు. కొన్ని వసతి గృహాల్లో మాత్రం ట్యూటర్లు బాగానే పనిచేస్తున్నారు. కొందరు వార్డెన్లు కొంతవరకు పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు.
‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకొచ్చిన
పలు అంశాలివీ...
మచిలీపట్నం రెండో నంబర్ హాస్టల్‌లో ట్యూటర్ రాలేదు. ఖాళీ కుర్చీ వద్దే విద్యార్థులు కూర్చుని చదువుకుంటున్నారు.
పెడనలోని రెండు హాస్టళ్లలో ట్యూటర్‌కు డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్లు రావడంలేదు. గత్యంతరం లేక విద్యార్థులు బయటకు వెళ్లి నెలకు రూ.150 చొప్పున సొంత డబ్బులు ఇచ్చి ప్రైవేటు క్లాసులు చెప్పించుకుంటున్నారు.
మండవల్లి బీసీ హాస్టల్‌లో ట్యూటర్ లేకపోవడంతో విద్యార్థులు రాత్రి సమయాల్లోనూ రైల్వేట్రాక్ దాటుకుని బయట ప్రైవేటు క్లాసుకు వెళ్లివస్తున్నారు.
కలిదిండి బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు కూడా రాత్రివేళ బయట ట్యూషన్‌కు వెళ్లడం ఇబ్బందికరంగా మారింది.
కైకలూరు బీసీ హాస్టల్‌లో వార్డెనే ట్యూటర్‌గా పనిచేస్తున్నారు.
గుడివాడ బీసీ హాస్టల్‌లో ముగ్గురే విద్యార్థులు ఉండటంతో ట్యూటర్‌ను ఇవ్వలేదు.
మైలవరంలో పౌష్టికాహారం గతేడాది నుంచి ఇవ్వడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో బిస్కెట్లు, పాలు, అరటిపండ్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని చెబుతున్నారు కానీ బడ్జెట్ కేటాయించలేదు.
నందిగామలో ట్యూటర్లు సకాలంలో రావడం లేదు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు హాస్టల్‌లో ఎనిమిది మంది పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్ లేకపోవడంతో బయట ప్రైవేటు క్లాస్‌లకు వెళుతున్నారు.
పామర్రు బీసీ బాలికల హాస్టల్‌లో ఏడుగురు ఉండటంతో ట్యూటర్ లేక సొంత డబ్బులతో బయటి ప్రైవేటుకు వెళుతున్నారు.
‘టెన్’షన్..
Published Wed, Jan 8 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement