నవ్విపోదురు గాక..! | Power Sector Employees Enjoying The Benefits Of The Poor | Sakshi
Sakshi News home page

నవ్విపోదురు గాక..!

Published Sat, May 28 2022 10:53 AM | Last Updated on Sat, May 28 2022 10:53 AM

Power Sector Employees Enjoying The Benefits Of The Poor - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: విద్యుత్‌శాఖలో జూనియర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను విజయనగరంలో ఉన్న తన సొంత ఇంటికి అక్రమంగా వినియోగించుకుంటున్నారు.

  • విద్యుత్‌శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను తన సొంత ఇంటికి మూడేళ్లుగా వాడుకుంటున్నారు.   
  • విద్యుత్‌శాఖలో జూనియర్‌ అకౌంట్స్‌ అధికారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సొంత ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న  ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు.   
  • ఈ ముగ్గురు ఉద్యోగులే కాదు. అనేక మంది ఉద్యోగులు  ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ లబ్ధిని అక్రమ మార్గాన పొందుతూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు.  ఎస్సీ, ఎస్టీల్లో  అధికశాతం మంది విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించుకోలేని పరిస్థితి.  అటువంటి వారికి చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో 200  యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే వారికి  ప్రభుత్వం ఉచితంగా   అందిస్తోంది. అయితే  కంచే చేను మేసినట్లు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం  ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పొందుతుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   
  • లబ్ధిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 1,00,987మంది 
  • జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ పథకం కింద లబ్ధిదారులు 1,00,987 మంది. వారికి  ఏడాదికి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తున్న నిధులు రూ.10.95 కోట్లు.   
  • గుర్తించిన అనర్హులు 19,996 మంది  
  • జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్‌  పథకాన్ని అక్రమంగా పొందుతున్న వారు 19, 996 మంది ఉన్నట్లు  ప్రభుత్వం గుర్తించి జాబితాను  విద్యుత్‌ శాఖ అధికారులకు పంపించింది.  2019 నుంచి ఉచిత విద్యుత్‌ పొందుతున్న వీరికి ప్రభుత్వం వెచ్చించింది రూ.6 కోట్లు.    

అనర్హులపై జాబితాపై సర్వే    
ప్రభుత్వం అందించిన అనర్హుల జాబితా ప్రకారం  విద్యుత్‌శాఖ అధికారులు   ఇప్పటివరకు 2,880 మందిని సర్వే చేశారు.   ఇంకా 17,116 మందిని సర్వే చేయాల్సి ఉంది. సర్వేలో విస్తుగొల్పే విషయాల్లో వెల్లడవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు కాని బీసీ, ఓసీ వర్గాల వారు  కూడా ఉచిత విద్యుత్‌ పొందుతుండడం గమనార్హం. 

నెలాఖరు లోగా సర్వే పూర్తి 
అనర్హుల జాబితా ప్రకారం ఇప్పటి వరకు 2,880 మందిని సర్వే చేశాం.   ఈ నెలాఖరు లోగా పూర్తి చేస్తాం. అనర్హుల్లో ఉద్యోగులు ఉంటే వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటాం.  
– పి.నాగేశ్వరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ 

(చదవండి: సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement