‘శుద్ధ జలం’ ఉత్తిదే! | No Pure water in medak district | Sakshi
Sakshi News home page

‘శుద్ధ జలం’ ఉత్తిదే!

Published Sat, Jan 25 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

No Pure water in medak district

గజ్వేల్, న్యూస్‌లైన్: ‘శుద్ధ జలం’ గ్రామీణ ప్రజలకు ఇక అందే పరిస్థితులు కనిపించడంలేదు. రక్షిత నీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టాలనుకున్న ఆర్‌ఓ ప్లాంట్ల పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్లుగా అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తామంటూ ఊరించి ప్రస్తుతం పూర్తిగా మరుగున పడేసింది. జిల్లాలో తొలివిడతగా 45 యూనిట్లను మంజూరుచేసినా నిధులివ్వకుండా చేతులెత్తేసింది. ఫలితంగా ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. కలుషిత నీటిని సేవించడం సర్వరోగాలకు కారణమవుతున్న తరుణంలో.. సురక్షిత నీటి వాడకంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ రంగంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి.
 
 ప్రస్తుతం ఇది లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. 20 లీటర్ల క్యాన్‌కు రూ.10 నుంచి 12 వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలతో ప్రమేయం లేకుండా ఇవే శుద్ధనీటిగా సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కడుపేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజలు నీటి కోసం నిత్యం 10 నుంచి 12 రూపాయలు వెచ్చించలేక కలుషిత నీటినే సేవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పేదలు రోగాల బారినపడి అల్లాడుతున్నారు. ఈ దుస్థితిని మార్చడానికి ప్రభుత్వం 2009-10 ఏడాదిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి నిర్ణయించింది. తొలివిడతలో జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 45 యూనిట్ల నిర్మాణానికి మంజూరు కూడా ఇచ్చారు.
 
 ఒక్కో ప్లాంటుకు రూ.5 లక్షల వరకు నిధులిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు ఒక్కోటి చొప్పున మంజూరు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో ప్లాంట్ల నిర్మాణానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన గ్రామ పంచాయతీ తీర్మానం, ప్లాంటు నిర్మాణానికి అవసరమైన స్థలాల సేకరణ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. కానీ నాలుగేళ్లు గడిచినా నిధులు మాత్రం పత్తాలేవు. నాలుగేళ్లుగా చోటుచేసుకుంటున్న జాప్యం తీరును పరిశీలిస్తే ఈ పథకానికి మంగళం పాడినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం అలసత్వం వల్ల ప్రైవేట్ రంగంలో మినరల్ వాటర్‌ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ నాణ్యతాప్రమాణాల మాటేమో గానీ ప్రజలను నీళ్లు పేరిట దోపీడీ చేస్తున్నాయి.  
 
 నిధుల విడుదలపై చడీచప్పుడు లేదు
 ఆర్‌ఓ ప్లాంట్ల పథకంపై చడీచప్పుడు లేదు. నిధులు వస్తాయనే ఆశలు కనిపించడంలేదు. ఆర్‌ఓ ప్లాంట్ల పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో కొత్త పథకం రాబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కలిగిన మంచినీటి బోరుబావులకు రూ.18వేల విలువైన పరికరాలను బిగించి నీటిని శుద్ధి చేసిన తర్వాత ప్రజలకు అందించడం జరుగుతుంది.   కొత్త పథకంతో ప్రజల ఇబ్బందులు తీరుస్తాం.              
       - విజయప్రకాశ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement