
రూల్స్ లేవ్..!
భూ సమీకరణపై అసెంబ్లీ వేదికగా ఏపీ సర్కారు అబద్ధాలు
సీఆర్‌డీఏ బిల్లు సమయంలో.. రూల్స్‌ను తర్వాత ప్రకటిస్తామన్న చంద్రబాబు
రైతులు, కౌలు రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు,
ఇతర చేతివృత్తిదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి, పరిహారం ఊసే లేదు
రూల్స్ రూపొందించి, వాటిపై అసెంబ్లీలో చర్చించి, ఆమోదించక ముందే..
విధివిధానాలేవీ లేకుండానే సంక్రాంతి లోగా సమీకరణ పూర్తిచేసే తాపత్రయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రాజధానికి అవసరమైన భూములను సమీకరించడానికి నియమ నిబంధనలు (రూల్స్) ప్రకటించకుం డానే ప్రభుత్వం భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంత రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ.. వారికి ఎలాంటి హామీ లేకుండానే సమీకరణకు తెగబడింది. ఇటీవలి కాలం లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాజ ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లు కు చట్టబద్ధత కల్పించే క్రమంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది. సీఆర్‌డీఏ చట్టానికి అనుగుణంగా రూల్స్ (నియమాలు) వెల్లడించిన తర్వాత వాటిపై తిరిగి అసెంబ్లీలో చర్చిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
సీఆర్‌డీఏ బిల్లును పురపాలక శాఖ మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. భూములు ఇచ్చే రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, ఇతరత్రా ఆ ప్రాంతాల్లో జీవనం సాగి స్తున్న ప్రజలకు ఎలాంటి ప్యాకేజీ, పరిహారం చెల్లిస్తారన్న వివరాలు బిల్లులో లేకుండా ఎలా ఆమోదిస్తారని సూటిగా ప్రశ్నించారు. దానిపై సీఎం చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. ముందు బిల్లు తయారవుతుందని, ఆ తర్వాత విడిగా రూల్స్ (నియమాలు) ఖరారు చేస్తామని, ఆ రూల్స్ మళ్లీ అసెంబ్లీ ముందు చర్చకు కూడా వస్తాయ ని, వాటిపై అభ్యంతరాలుంటే ఆ సమయంలో తెలియజేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. సీఆర్‌డీఏ చట్టం-2014 లోని తొలి చాప్టర్‌లో గల సెక్షన్ 38 లోనూ రూల్స్ విషయంలో ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. ఈ చట్టానికి అనుగుణంగా మార్గదర్శకాలు తయారు చేసి తిరిగి అసెంబ్లీ ముందుకు వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మేరకు మూజువాణి ఓటుతో సీఆర్‌డీఏకు చట్టబద్ధత కల్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాలను దాటవేసింది.
ఉపాధి, పరిహారం ఊసు లేకుండానే...
సీఆర్‌డీఏపై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైతుల నుంచి భూములు సమీకరించినప్పుడు వారికి నష్టపరిహారాన్ని ఏ విధంగా ఇస్తారు? కౌలు రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఏంటి? వ్యవసాయ కూలీలు, ప్రస్తుతం ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఇతర మార్గాల్లో ఉపాధిపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు ఎలాంటి పరిహారం చెల్లిస్తారన్నది అధికారికంగా ప్రకటించకుండా.. తయారు చేసిన రూల్స్‌పై మళ్లీ అసెంబ్లీలో చర్చించి ఆమోదించకుండానే అధికారులు రాజధాని ప్రాంతాల్లో భూ సమీకరణపై హడావుడి చేస్తూ రైతులను ఒప్పించే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఈ నెల 2న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో సీఆర్‌డీఏ రూల్స్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరారు చేశాక ఆ మార్గదర్శకాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. అదేమీ లేకుండానే సీఆర్‌డీఏపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన క్షణం నుంచే భూ సేకరణను ప్రారంభించడం విడ్డూరం. అదీ సంక్రాంతిలోగా భూ అంగీకార పత్రాల సేకరణ కూడా పూర్తి చేయాలని లక్ష్యం గా నిర్దేశించడం విస్మయం గొలుపుతోంది.
27 బృందాలు... 300 మంది సిబ్బంది..
సీఆర్‌డీఏ చట్టం - 2014పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ప్రభుత్వం రైతుల నుంచి భూములను తీసుకోవడానికి ప్రత్యేకంగా 27 బృందాలను ఏర్పాటు చేసింది. దాదాపు 300 మంది అధికారులను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించింది. వీటికి తోడు రాజధానికి ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది బృందాలు ప్రవేశించడమే కాకుండా ఆగమేఘాల మీద రైతులను హడావుడి పెట్టారు. ఈ 27 రెవెన్యూ బృం దాలపై పర్యవేక్షణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవా రం జీవో జారీ చేసింది.అలాగే 300 మంది సిబ్బందిని కూడా ఎంపిక చేసింది.
భూ సమీకరణకు అధికారం ఎవరిచ్చారు?
జస్టిస్ లక్ష్మణరెడ్డి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి
సీఆర్‌డీఏ చట్టమైంది కాబట్టి దాని తర్వాత రూల్స్ (నిబంధనలు) రూపొందించాలి. వాటిని అసెంబ్లీకి తీసుకురావాలి. అక్కడ ఆమోదం పొందాక మిగతా కార్యక్రమాలు చేయాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి కూడా ఇదే చెప్పారు. అయితే ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లి ల్యాండ్ పూలింగ్ చేయనున్నామని, తమను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పినట్టు ఆయా గ్రామాల ప్రజలు వెల్లడిస్తున్నారు. సెక్షన్ 10 (ఎ) ప్రకారం ప్రభుత్వ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి భూములు సర్వే చేసుకోవచ్చు. జనాభా లెక్కలు, భూసమీకరణలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఇలా అన్నిటిపైనా సర్వే చేసుకోవచ్చు గానీ.. భూసేకరణ చేస్తామంటూ ఏ అధికారంతో వెళతారు?దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ ఆర్డినెన్స్ విజయవాడలో భూసమీకరణకు కూడా వర్తిస్తుందని కొందరు ప్రభుత్వాధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇది పట్టణీకరణ విషయంలో వర్తించదు. పాత చట్టమే వర్తిస్తుంది. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రాజెక్టుల నిర్మాణంవంటి వాటికే ఆర్డినెన్స్ తప్పా రాజధాని భూ సమీకరణకు ఇది వర్తించదు. వర్తించదు.
పథకం ప్రకారమే సర్కారు వ్యాపారం...
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శాసనసభ్యుడు, వైఎస్సార్‌సీపీ
సీఆర్‌డీఏ చట్టంలో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని అసెంబ్లీ సాక్షిగా నేను, మా పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దీనికి సీఎం, ఆర్థికమంత్రి బదులిస్తూ ముందు చట్టం వస్తుంది ఆ తర్వాత రూల్స్ తెస్తామన్నారు. ఇప్పుడేమో రూల్స్ తేకుండానే ల్యాండ్ పూలింగ్‌కు వెళుతున్నారు. మీరు తేబోతున్న రూల్సేమిటో ఒక్క రైతుకైనా వివరించారా? రోడ్లకు, బలహీన వర్గాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత స్థలాలు ఇస్తున్నదీ చెప్పిన మీరు, రైతులకు ఎంత ఇస్తున్నది ఎందుకు చెప్పలేకపోయారు? ఎక్కడైనా ఒక చట్టం వచ్చాకే ఎంఓయూ చేసుకుంటారు. కానీ చట్టం ఇంకా అమల్లోకి రాకముందే సింగపూర్ పార్టీతో మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారు?. ఒక చిన్న ఉద్యోగానికైనా నిబంధనలు రూపొందించాకే నియామకం చేస్తారు. కానీ 30 వేల ఎకరాల భూములు మీరు లాక్కుంటున్నప్పుడు రైతులకు సమాధానం చెప్పకుండా, ఎలా తీసుకుంటున్నదీ వివరించకుండా చేస్తున్నారంటే మీది వ్యాపారం కాక మరేమనుకోవాలి? రూల్స్ రూపొందించాక,ల్యాండ్ పూలింగ్‌కు వెళితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంది? దీనివెనుక మతలబు ఉంది కాబట్టే హడావిడిగా అన్నీ చేసేస్తున్నారు.