తీరం.. భద్రమేనా..! | No Safety in machilipatnam beach | Sakshi
Sakshi News home page

తీరం.. భద్రమేనా..!

Published Thu, Apr 25 2019 1:58 PM | Last Updated on Thu, Apr 25 2019 1:58 PM

No Safety in machilipatnam beach - Sakshi

బందరు తీరంలో బోటుపై గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు

ప్రభుత్వ ఉదాసీనత తీరప్రాంత భద్రతకు పెను  ముప్పుగా పరిణమిస్తోంది.  కంటి మీద కునుకు లేకుండా కాపలా ఉండాల్సిన మెరైన్‌ పోలీసులను వసతుల లేమి వెంటాడుతుండడంతో భద్రత చుక్కాని లేని నావలా తయారైంది. కొత్త మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లు లేవు.. కొత్త బోట్లు రాలేదు.. ఉన్నవి కాస్త మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. సిబ్బంది నియామకం కూడా లేకపోవడంతో చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా కరువైంది. ఫలితంగా మన తీరం..  భద్రమేనా? అన్న సందేహం కలుగుతోంది.

సాక్షి, అమరావతి బ్యూరో: ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబో నగరం నెత్తురోడింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల్లో సుమారు 359 మంది మృతి చెందారు. వందల మంది గాయాలపాలయ్యారు. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం అక్కడి పోలీసు వర్గాలు, సైన్యం తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితులు తప్పించుకునే క్రమంలో సముద్రజలాల ద్వారా మన భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందాయి. కేంద్రం నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకించి తీర ప్రాంత భద్రతను పర్యవేక్షించే మెరైన్‌పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఉన్న 22 పోలీసుల స్టేషన్ల పరిధిలో పోలీసులు తీరాన్ని జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదిలకలపై నిఘా పెట్టారు.

తీరం వెంట పహారా
రాష్ట్రంలోని తడ నుంచి ఇచ్ఛాపురం దాకా 972 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న తీరంపై 22 మెరైన్‌ స్టేషన్ల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రత్యేకించి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని తీరప్రాంతంపై ప్రధానంగా దృష్టి సారించారు. రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 5 మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గిలకలదిండి, వరాలగుండి, పాలకాలయతిప్ప, గుంటూరు జిల్లాలో సూర్యలంక, నిజాంపట్నం మెరైన్‌ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో మెరైన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. తీరం వెంట పహారా కాస్తున్నారు. గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. సముద్రజలాల్లో ఎక్కడైనా, ఎవరైనా కొత్త వ్యక్తులు తారస పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

వెంటాడుతున్న వసతులలేమి!
కీలకమైన రాజధాని అమరావతి ప్రాంతానికి ఐదు మెరైన్‌ స్టేషన్లు ఏమాత్రం సరిపోవని 2015లోనే గుర్తించారు. రెండు జిల్లాల్లో మరో నాలుగు మెరైన్‌ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇంతవరకు కొత్తగా ఒక్క మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనే లేదు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గిలకలదిండి, సూర్యలంక మెరైన్‌ పోలీస్‌స్టేషన్లకు మూడేసి చొప్పున గస్తీ బోట్లు సమకూర్చారు. అన్ని పోలీస్‌స్టేషన్లకు కొత్తగా మూడేసి బోట్లు సమకూర్చాలన్న ప్రతిపాదనను పట్టించుకోనేలేదు. కొన్ని స్టేషన్లలో ఉన్న బోట్లు కూడా కొన్ని నెలలుగా తీరంలోనే లంగరు వేసి ఉన్నాయి. గస్తీ నిర్వహణకు ఉన్న ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ బోట్లు తక్కువే. ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో ఒక్క బోటే పనిచేస్తోంది. దీంతో తీరంలో గస్తీ అంతంతమాత్రంగానే ఉండటంతో చొరబాట్లకు అవకాశం లేకపోలేదని మెరైన్‌ పోలీసు వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement