ఎనీ టైం మోసం.. ఏటీఎంల వద్ద భద్రత కరువు | No security Guard alert near ATM centers | Sakshi
Sakshi News home page

ఎనీ టైం మోసం.. ఏటీఎంల వద్ద భద్రత కరువు

Published Fri, Nov 22 2013 7:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

No security Guard alert near ATM centers

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖాతాదారుల సౌకర్యం కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలకు చెందిన బ్యాంకులు ఏటీఎంలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో 27 బ్యాంకులకు గ్రామీణ ప్రాంతాల్లో 164, పట్టణ ప్రాంతాల్లో 95 శాఖలు ఉన్నాయి. అన్ని బ్యాంకుల పరిధిలో మొత్తంగా 163 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో బ్యాంకుల ఆవరణలో పనిచేస్తున్న వాటిని ఆన్ సైట్ ఏటీఎంలుగా(53 చోట్ల), మిగతా వాటిని ఆఫ్‌సైట్ ఏటీఎంలుగా పరిగణిస్తున్నారు. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో ఎక్కువ సంఖ్యలో ఏటీఎంలు నెలకొల్పారు. ఆన్‌సైట్ ఏటీఎంలలో పాక్షికంగా మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. పట్టణాల్లోని ఆఫ్‌సైట్, మారుమూల ప్రాంతాల్లోని ఆన్‌సైట్, ఆఫ్‌సైట్ ఏటీఎంలతో కనీస భద్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదు. 24 గంటల పాటు కాపలా ఉండాల్సిన చోట ఒకటి లేదా రెండు షిఫ్టుల్లో మాత్రం సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద భద్రత లేకపోవడంతో ఖాతాదారులు ఏ క్షణంలో ఏ ఉపద్రవం ఎదురవుతుందో తెలియక భయాందోళన నడుమ నగదు విత్‌డ్రా చేసుకోవాల్సి వస్తోంది.
 
 ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ పనిచేయడం లేదు. ఒకరొకరుగా వెళ్లాల్సిన ఖాతాదారులు మూకుమ్మడిగా ఏటీఎం వద్దకు వెళ్తున్నారు. దీంతో లావాదేవీల వివరాలు, పాస్‌వర్డ్ తదితరాలను రక్షించుకోవడం ఖాతాదారులకు ఇబ్బందిరకంగా తయారవుతోంది.
     సీసీ కెమెరాలు ఉన్నా సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే కోణంలో బ్యాంకు సిబ్బంది తనిఖీలు చేస్తున్న దాఖలా కనిపించడం లేదు.
     ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఏసీలు ఒకటి రెండుచోట్ల మినహా ఎక్కడా పనిచేయడం లేదు. దీంతో సాఫ్ట్‌వేర్ సమస్యలతో ఏటీఎంలలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అధికారులు ‘ఔటాఫ్ ఆర్డర్’ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.
     పారిశుద్ధ్యం నిర్వహణ లోపంతో ఏటీఎంలు చెత్త కుండీలను తలపిస్తున్నాయి. లావాదేవీలకు సంబంధించిన స్లిప్‌లతో చెత్తబుట్టలు నిండినా ఖాళీ చేయడం లేదు. దీంతో ఏటీఎంలు దోమలకు ఆవాసాలుగా మారాయి.
     వారాంతాలు, లావాదేవీలు ఎక్కువగా జరిగే నెల మొదటి, రెండు వారాల్లో నగదు నిండుకున్నా రోజుల తరబడి భర్తీ చేయడం లేదు. జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో వుండే ఏటీఎంలలో నగదు నిండుకోవడంతో తరచూ ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.
     జాతీయ బ్యాంకుల ఏటీఎంలలో త్వరితగతిన నగదు నిండుకోవడంతో ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు. సర్వీస్ టాక్స్ పేరిట ప్రైవేటు బ్యాంకుల లావాదేవీలు ఖాతాదారులపై భారం వేస్తున్నాయి.
     గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లోని ఏటీఎంలతో నగదు నిల్వలు లేకపోవడంతో  ఖాతాదారులు వ్యయ, ప్రయాసలు ఎదుర్కొంటున్నారు.


 అప్రమత్తం చేశాం
 ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకులపైనే ఉంది. భద్రత చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే బ్యాంకర్లను అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాం. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నదీ లేదని తనిఖీలు చేసుకోవాల్సిందిగా సూచించాం. రాత్రి వేళల్లో ఏటీఎంలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా పోలీసు గస్తీ బృందాలకు ఆదేశాలు జారీ చేశాం.
  విజయ్ కుమార్, ఎస్పీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement