ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై క్లాజుల వారీగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తెలుగుదేశం సీమాంధ్ర నేతలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖలను అందజేశారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై క్లాజుల వారీగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తెలుగుదేశం సీమాంధ్ర నేతలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖలను అందజేశారు. అయితే వాటిలో ఎక్కడా విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు వారు పేర్కొనకపోవడం గమనార్హం. బిల్లులోని 108 క్లాజులపైనా అభిప్రాయాలు వ్యక్తీకరిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మినహా 43 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ప్రతిపాదనలను అందించారు. క్లాజ్ 1 మొదటి ఎస్సార్సీకి భిన్నంగా ఉందని, క్లాజ్ 3 భాషాప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకమని తమ అభిప్రాయాలను పేర్కొన్నారు.
బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఎక్కడా చెప్పకపోగా, బిల్లులోని 90, 93 క్లాజులను అంగీకరిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు పది సూచన లు చేస్తూ గురువారమే స్పీకర్‌కు లేఖలు అందచేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా శుక్రవారం శాసనసమండలిలో ఛైర్మన్‌కు లేఖలు అందచేశారు. వీటికి అదనంగా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండేందుకు అనువుగా తెలంగాణ రాష్ట్రంలో 119కి బదులు 150 మంది శాసనసభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలకు బదులు 50 మంది ఉండాలని సూచించారు.