కొడుకు కాదు.. యముడు | No son .. Yama | Sakshi
Sakshi News home page

కొడుకు కాదు.. యముడు

Published Thu, May 22 2014 4:59 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

No son .. Yama

ప్రేమకు మారుపేరు అమ్మ.. తన భర్తను చంపినా క్షమించింది..ఓర్పుకు మారు పేరు అమ్మ.. కోడలిని చంపి జైలుకెళ్లిన కొడుకును బెయిలుపై బయటకు తెచ్చేందుకు అహరహం శ్రమించింది..కొడుకే మానవ మృగమై చివరకు కన్నతల్లినీ కడతేర్చాడు.            
 
శ్రీరంగరాజపురం మండలం ఎగువముద్దికుప్పం గ్రామంలో వృద్ధురాలు దేశమ్మ ఒంటరిగా ఉంటోంది. డెబ్భైరెండేళ్ల వయసులో రేయింపగలూ కష్టపడుతోంది. ఆమెకు పిల్లలు లేరా అంటే.. లేకేం ఉన్నాడు.. ఒక్కడే కొడుకు. పేరు బాలకృష్ణారెడ్డి. యాభై ఏళ్ల వయసు. అతను జైల్లో ఉన్నాడు. అయ్యో.. అనుకుంటున్నారా.. దేశమ్మ ఒక్కటే తన బిడ్డ కోసం అయ్యో అనుకుంది. ఊరిలో ఎవ్వరూ అతడిని అయ్యో అనుకోలేదు.
 
బాలకృష్ణారెడ్డి మద్యానికి బానిస. రోజూ మందు తాగందే నిద్రపోడు. మందుకు డబ్బు ఇచ్చే వరకూ ఇంట్లో వాళ్లనూ నిద్రపోనివ్వడు. ఆరేళ్ల క్రితం మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రి మునిరత్నం రెడ్డినే హత్య చేశాడు. ఈ కేసులో బాలకృష్ణారెడ్డి రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. భర్తను చంపిన కొడుకు శిక్ష అనుభవించి జైలు నుంచి ఇంటికి వచ్చాడు. పోయిన భర్త ఎలానూ పోయాడు, కొడుకైనా ఉన్నాడు చాలనుకుంది దేశమ్మ.

ఇకనైనా తన కొడుకులో మార్పు ఉంటుందనుకుంది. అది ఆమె భ్రమే అయింది. రెండేళ్ల క్రితం బాలకృష్ణారెడ్డి భార్య శారదతతో గొడవ పడ్డాడు. ఆవేశం పట్టలేక ఆమెనూ చంపేశాడు. ఆమెది ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఇది కుదరక పోవడంతో పోలీసులకు చిక్కాడు. అప్పటి నుంచీ జైల్లో ఉన్నాడు.
 
భర్త పోయాడు. కోడలూ పోయింది.. వాళ్లను చంపిన కొడుకు జైళ్లో ఉన్నాడు. అయినా దేశమ్మకు కొడుకుమీద ప్రేమ తగ్గలేదు. ఎలాగైనా సరే తన కొడుకును జైలు నుంచి బయటకు తీసుకురావాలనుకుంది. ఉన్న కాస్త పొలంలో ఏవో సాగు చేసింది. తినీ తినకా డబ్బు కూడబెట్టుకుంది. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని.. ఎలాగైతేనేం, కొడుకును బెయిల్‌పై ఇంటికి తీసుకొచ్చింది.
 
ఇకనైనా కొడుకు మారతాడని అనుకుంది. ఈ ముసలి వయసులో తనను చూసుకుంటాడనుకుంది. కానీ కొడుకులో మార్పు రాలేదు. అతనిలోని మద్యం మహమ్మారి మరోసారి నిద్రలేచింది. ఉన్న పొలాన్ని అమ్మేశాడు. ఆ డబ్బంతా జల్సా చేసేశాడు. ఏ పనీ చేయడు. వేళకు మాత్రం తిండి కావాలంటాడు.
 
కన్నకొడుకు పస్తుంటే దేశమ్మ చూడలేకపోయింది. ఇంటికి ఆనుకుని ఉన్న కాస్త పొలంలో, ఉడిగిన రెక్కల్లో సత్తువ నింపుకుని కూరగాయలు సాగుచేసింది. ఉన్నంతలో యాభై ఏళ్ల కొడుక్కు లోటు లేకుండా చూసుకుంది.
 
అయినా బాలకృష్ణారెడ్డిలో మార్పు రాలేదు. 72 ఏళ్ల అమ్మను మంగళవారం రాత్రి డబ్బు అడిగాడు. తాను మద్యం తాగాలన్నాడు. ఆమె ఇవ్వలేదు. అసలు ఆమె దగ్గర డబ్బు ఉందో లేదో కూడా తెలీదు. కొడుకులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే అతను మద్యం తాగేసి ఉన్నాడు. డబ్బు ఇవ్వలేదనే కోపంతో కర్రతో తల్లినెత్తిన బాదాడు.
 
డెబ్భైరెండేళ్ల అమ్మ.. యాభై ఏళ్లపాటు బాలకృష్ణారెడ్డిని కంటికి రెప్పలా కాపాడిన అమ్మ.. అచేతనంగా మారింది. ఆమెచుట్టూ రక్తం మడుగు కట్టింది. ఆ కట్టెలో ఇప్పుడూ ఏప్రేమలూ లేవు... ఏ ఆరాటమూ లేదు.. కసాయి కొడుకు, తల్లి చనిపోయిందని ఊర్లో చెప్పి ఇంటిని వదిలి పరారయ్యాడు.
 
దేశమ్మ శవాన్ని చూసి ఎగువముద్దికుప్పం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.. కసాయి కొడుకును కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అతనో సైకో అని, అతను తమ గ్రామంలోకి రాకుం డా చూడాలని పోలీసులను వేడుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement