వికలాంగులపై దయచూపని సర్కార్
Published Sun, Aug 18 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
సాక్షి, సంగారెడ్డి: వికలాంగులకు ప్రభుత్వం చేయూత కరువైంది. వారి సమస్యలను ఎలాగూ పరిష్కరించలేకపోయినా కనీసం పింఛన్లు కూడా అందించలేకపోతోంది ఈ ప్రభుత్వం. తమ శరీరం సహకరించకపోయినప్పటికీ వికలాంగులు అష్టకష్టాలు పడుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది వికలాంగులు సంగారెడ్డిలోని కలెక్టరేట్ వరకు వచ్చి గ్రీవెన్స్ సెల్‌లో అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నా వారికి న్యాయం జరగడం లేదు. పింఛన్ల కోసం సమర్పించే వినతులు స్వీకరిస్తున్న అధికారులు దానిపై ‘వెరిఫై’ అని గ్రీన్ ఇంకుతో రాసి మరో అధికారికి ఇస్తున్నారు. అక్కడే ఉండే ఓ క్లర్కు అప్పటికే కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ దరఖాస్తుల కింద ఆ కాగితాన్ని చొప్పిస్తాడు. ‘ఇక మీరొచ్చిన పని అయిపోయింది బయటకు పదండి’ అని అక్కడే ఉంటే అటెండర్ చెబుతాడు. ఇంకేముంది వచ్చిన దారిలో ఇంటిముఖం పట్టడం తప్ప వికలాంగులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాంటి దృశ్యాలు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో కన్పిస్తుంటాయి.
వందల మంది బాధితుల గోసను నిత్యం ప్రత్యక్షంగా చూసే జిల్లా అధికారులకు మాత్రం ఇది సర్వ సాధారణ అంశం. ఏది ఏమైనా.. దాదాపు రెండేళ్ల తర్వాత పింఛన్ల దరఖాస్తులకు మోక్షం కల్పించిన సర్కారు వికలాంగులకు మాత్రం ముష్టి విదిల్చింది. తాజాగా ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడంతో సెప్టెంబర్ నుంచి జిల్లాలో 30,206 మందికి కొత్తగా పింఛన్లు అందనున్నాయి. ఇందులో 214 వికలాంగులు, 17,283 వృద్ధాప్య, 12,239 వితంతు, 381 చేనేత, 89 కళ్లు గీత కార్మికులకు సంబధించిన పింఛన్లు ఉన్నాయి. ఇందులో వికలాంగులకు కేవలం 214 పింఛన్లు మాత్రమే మంజూరు కావడం చూస్తుంటే ప్రభుత్వం వారికి ఏ మేరకు ఆసరాగా ఉందో అర్థమవుతుంది. రచ్చబండ-2లో వికలాంగ పింఛన్ల కోసం 1,867 దరఖాస్తులు వస్తే విచారణ అనంతరం 1,128 మంది అర్హులని అధికారులు నిర్ధారించారు. రచ్చబండ కాకుండా మిగతా రోజుల్లో ఇంకా వేలాది దరఖాస్తులు వచ్చాయి.
సరైన వైకల్య ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు లేకపోవడంతో మిగిలిన దరఖాస్తుదారులకు పింఛన్లు మంజూరు కాలేదని డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. మండల కార్యాలయాల నుంచే నేరుగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని, రేషన్‌కార్డు నంబరును అప్‌లోడ్ చేయకపోయినా పింఛన్ మంజూరయ్యే అవకాశాలు లేవన్నారు. ఇలాంటి కేసులుంటే రేషన్‌కార్డు నంబర్‌లను మళ్లీ అప్‌లోడ్ చేస్తే బాధితులకు పింఛన్లను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.
కొంప ముంచుతున్న సాఫ్ట్‌వేర్..
వైకల్య నిర్ధారణ కోసం ప్రభుత్వం రెండేళ్ల క్రితం ‘సదెరెమ్’ పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రతి నెలా మూడో మంగళ, బుధవారాల్లో ఈ ధ్రువ పత్రాలు జారీ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా వైకల్యం శాతానికి అనుగుణంగా ఈ ధ్రువీకరణ పత్రాలిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ గుర్తించలేని వివిధ రకాల తీవ్ర వైకల్యాలతో బాధపడుతున్న వారికి ఈ ప్రక్రియ ప్రతిబంధకంగా మారింది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా వైకల్యాన్ని తక్కువగా చూపుతూ పత్రాలు జారీ చేస్తున్నారు. 50 శాతం వైకల్యం కలిగి ఉంటేనే పింఛన్లకు అర్హులనే నిబంధన ఉండడంతో బాధితులు పింఛన్లకు అర్హత సాధించలేకపోతున్నారు.
Advertisement
Advertisement