
త్యాగరాజదాస నారాయణ
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ : నేను 1918లో పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలిలో జన్మించాను. ఎస్సెల్సీ వరకు విద్యాభ్యాసం సాగింది. టైపు, షార్టుహ్యాండు నేర్చుకుని వరంగల్‌లోని అజాంజాహి బట్టలమిల్లులో స్టెనోగా ఉద్యోగపర్వం ప్రారంభించాను. 1942లో రాజమండ్రి పేపరుమిల్లులో ఉద్యోగం లభించడంతో నగరానికి వచ్చాను. ఇక సంగీతం విషయానికి వస్తే, నాకు గురువంటూ ఎవరూ లేరు. చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేది.
తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్ర లేవడం అలవాటు. ఆ సమయంలో ఎవరో సంగీతం ఆలపిస్తున్నట్టు నాకు స్పష్టంగా వినిపించేది. అలా వింటూ వింటూ సాధన చేసేవాడిని. ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మను సంగీతం నేర్పమని అడి గాను..‘నేను నేర్పను, నీవు ఎవరి వద్దా నేర్చు కోవద్దు’ అని ఆయన అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒకసారి నాతో ‘శ్రీరాముడే నీకు గురువు’ అన్నారు.
త్యాగరాజదాస నారాయణ సేవాసమితి నేపథ్యం
బుగ్గా పాపయ్యశాస్త్రి ఆ రోజుల్లో సంగీతం ట్యూషన్లు చెప్పేవారు. ఏటానేటి విశ్వేశ్వరస్వామి ఆలయం ఎదుటి వీధిలో, తరువాత హిందూ సమాజంలో నిర్వహించే వారు. సంగీతంపై మక్కువ నన్ను.. వారికి దగ్గర చేర్చిం ది. మద్రాసు మ్యూజిక్ అకాడమీలో సంగీతంలో ప్రతి భను ప్రదర్శించడాన్ని కళాకారులు ఎలా గీటురాయిగా భావిస్తారో, రాజమండ్రి త్యాగరాజదాస నారాయణ సేవా సమితిని కూడా అలాగే భావించేవారు, నేటికీ భావిస్తున్నారు.
సమితి అభివృద్ధి కోసం
శ్రీత్యాగరాజదాస నారాయణ సేవాసమితి సంస్థను రిజిస్టరు చేయడం, సమితికి వచ్చే విరాళాలకు ఆదా యపు పన్ను మినహాయింపు తేవడంలో నేను తిరిగి, విజయం సాధించాను. ఎక్కడికి వెళ్లినా, బుగ్గా పాపయ్యశాస్త్రి నడిచే వెడుతూండేవారు. ఆయనకు సైకిల్ లేదు, రాదు. నేను ఆయన్ను సైకిల్ ముందు కూర్చుండపెట్టుకుని చందాలకు తిరుగుతూండేవాడిని.
ఆ రోజుల్లో పది రూపాయలు ఎవరైనా ఇస్తే గొప్ప. పదవీ విరమణ తరువాత నాకు రిటైర్మెంటు బెనిఫిట్స్ రూపేణా వచ్చిన సొమ్మును సమితికి ఇచ్చేశాను. శ్రీరాంనగరులో నాకు ఉన్న ఇంటిని అమ్మగా వచ్చిన సొమ్ములో సింహభాగం సమితికి ఇచ్చాను. నాటి మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆరేపల్లి సుబ్బారావు సమితికి సొంత స్థలం రావడానికి కృషి చేశారు.
నేను, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ హైదరాబాదులో నాటి స్పెషల్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహారావును కలిశాం. ఆయన ఇచ్చిన హామీ మేరకు సమితికి సొంత స్థలం లభించింది. సమితి ప్రాంగణంలో శ్రీసీతా రామ లక్ష్మణుల మందిరంలో, ఆ దివ్యమూర్తుల సన్నిధిలో త్యాగయ్య విగ్రహాన్ని నెలకొల్పాను.
సంగీత కార్యక్రమాలకు ప్రధాన వేదికగా...
దేశం గర్వించదగ్గ ఎందరో సంగీత విద్వాంసులకు త్యాగరాజదాస నారాయణ సేవాసమితి ప్రధాన వేదిక అయింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ఇవటూరి విజయేశ్వరరావువంటి మహానుభావులు ఇక్కడ సత్కారాలు అందుకున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు టీఎన్ శేషుగోపాలాన్ని ఒకసారి సమితి సంగీత కార్యక్రమాలకు ఆహ్వానించాం.
పారితోషికం రెండు వేల రూపాయలు దాటి ఇవ్వలేమని రాశాం. అయిదు వేలు ఇస్తేగాని రాలేనని ఆయన జాబు రాశారు. నేను ఉత్తరం రాస్తూ, ‘మీలాంటి పెద్దలను పిలవడానికి మా సమితి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నాను’ అని రాసి, ఉత్తరం కింద ఒక త్యాగరాజదాస కృతిలోని రెండు పంక్తులను ఉటంకించాను.
‘కొనియాడెడు నా ఎడ దయ- ‘వెలకు’కొనియాడెదవు సుమీ’...
ఈ ఉత్తరం ఆయన మీద తీవ్రప్రభావం చూపి ఉంటుంది. నేను వస్తున్నాను అని ఆయన తెలియపరిచారు. మేము జాబు రాస్తూ, మీరు రానన్నారు కనుక, వేరొకరితో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.. వచ్చే సంవత్సరం మిమ్ములను ఆహ్వానించగలం అని తెలియపరిచాం. మరుసటి సంవత్సరం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రస్తుత వ్యాసంగం
ప్రచారాలకు నేను ఎన్నడూ ఆరాటపడలేదు. శ్రీరాముని దయతో తృప్తికరమైన జీవితం గడుపుతున్నాను. కళా గౌతమి సంస్థ బులుసు సాంబమూర్తి స్మారక పురస్కారంతో నన్ను సత్కరించింది. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివ రామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉగాది పురస్కారాన్ని అందుకున్నాను. అనేక సంవత్సరాలు సమితి వార్షికోత్సవాలలో త్యాగరాజస్వామి వేషంలో కీర్తనలు ఆలపిస్తూ, నగర సంచారం చేశాను.
కర్మిష్ఠి జోస్యుల సూర్యనారాయణ
కళత్ర వియోగం కడుపులోనే దాచుకుని, కర్తవ్యదీక్షలో ముందుకు సాగుతున్న కర్మిష్ఠి జోస్యుల సూర్యనారాయణ. తనకంటూ ఏమీ మిగుల్చుకోకపోయినా, తనదంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్న మహనీయుడు జోస్యుల నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. - చేబియ్యం వెంకట రామయ్య, సీనియర్ న్యాయవాది.
సమితికి వెన్నెముక
శ్రీత్యాగరాజదాస నారాయణ సేవాసమితికి వెన్నెముకగా జోస్యుల సూర్యనారాయణ నిలబడ్డారు. సమితి వ్యవస్థాపకుడు బుగ్గా పాపయ్యశాస్త్రికి చేదోడువాదోడుగా ఉండేవారు. మేము ఆయనకు సన్మానం చేసి వెండి సజ్జెను ఇస్తే, తిరిగి సమితికి ఇచ్చేశారు. రూ.25 వేల పర్సు బహూకరిస్తే, అదీ తిరిగి సమితికే ఇచ్చేశారు. సమితి నిర్వహణకు 95 ఏళ్ల వయసులోకూడా ఆయన మాకు చక్కని సూచనలను ఇస్తున్నారు. నేటికీ కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు. - వక్కలంక శ్రీరామచంద్రం,
కార్యదర్శి, శ్రీత్యాగరాజదాస నారాయణ సేవాసమితి