Attili
-
భయపడొద్దమ్మా.. నేనున్నా..
అత్తిలి: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. ఆమె వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్వ వెంకయ్య కాలువ గట్టు వద్ద నివసిస్తున్న ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా కోనాల ఆంజనేయులు, కామాక్షి దంపతులు తమ కుమార్తె దానేశ్వరిని తీసుకువచ్చి సీఎం జగన్‌ను కలిశారు. తమ కుమార్తె కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోందంటూ కన్నీరుపెట్టుకున్నారు. వైద్యం కోసం చాలా ఖర్చు చేశామని.. అయినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే ఆదుకోవాలి జగనన్నా అంటూ విలపించారు. సీఎం జగన్ ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు. ఆంజనేయులు దంపతులకు ధైర్యం చెప్పారు. పాప విషయంలో భయపడొద్దని.. వైద్యానికయ్యే ఖర్చు రూ.40 లక్షలను ప్రభుత్వం భరిస్తుందంటూ భరోసా ఇచ్చారు. దీంతో ఆంజనేయులు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. దేవుడిలా వచ్చి ఆదుకుంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
షష్ఠి సంబరం.. మొక్కులు చెల్లిస్తే సంతాన భాగ్యం
సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే అందరికీ గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిలా అత్తిలిలో జరిగే ఉత్సవాలు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఏటా అట్టహాసంగా షష్ఠి తీర్థం నిర్వహిస్తారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, ఇలా ఎందరో స్వామిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తే తమ సమస్యలు తీరతాయని విశ్వసిస్తారు. శతాబ్దంపైగా చరిత్ర ఉన్న అత్తిలి షష్ఠి ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. ఈ ఏడాది డిసెంబరు 8 నుంచి షష్ఠి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు శతాబ్దానికిపైగా చరిత్ర అత్తిలిలో షష్ఠి ఉత్సవాలకు శతాబ్దానికిపైగా చరిత్ర ఉంది. 1910వ దశకంలో అత్తిలి పంచాయతీ కార్యాలయం సమీపంలోని కోనేటి వద్ద పెద్ద పుట్ట ఉండేది. అక్కడ ప్రజలు నిత్యం పూజలు చేసేవారు. ఆ తర్వాత ఏకశిలపై శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతీసంవత్సరం మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామి వారి కల్యాణం, షష్ఠిన తీర్థం, రాత్రికి స్వామివారి ఊరేగింపు చేసేవారు. 1929లో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. గ్రామ ప్రముఖులు బాదరాల గోపాలం, కాకర్ల సోమన్న, మునసబు కానుమిల్లి వెంకటరామయ్య తదితరులు ఆలయ అభివృద్ధికి కృషిచేశారు. భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ అప్పట్లో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. 1932లో కల్యాణ మండపాన్ని, 1967లో అన్నదాన సత్రాన్ని నిర్మించారు. 1933లో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం 1994లో షష్ఠి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదానికి గురవడంతో 1996లో మరొకటి ఏర్పాటుచేశారు. 1958లో అన్నదానం నిమిత్తం 4.49 ఎకరాలు, 1963 లో 2.74 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అత్తిలిలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి పేరున ఆలయ కమిటీ సహకారంతో నెలకొల్పినవే. ఏటా ప్రముఖులకు సన్మానం అత్తిలిలో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో రూ.కోట్ల వ్యయంతో భారీ కల్యాణ మండపాన్ని నిర్మించారు. షష్ఠి ఉత్సవాలు సందర్భంగా వివిధ రంగాల ప్రముఖుల్ని సన్మానించడం ఆనవాయితీ. ముఖ్యంగా ఈలపాట రఘురామయ్యను తులాభారంతో సత్కరించిన ఖ్యాతి అత్తిలి షష్ఠి ఉత్సవాలకే దక్కింది. షష్ఠి తిరునాళ్ళ సమయంలో ప్రదర్శించే సాంఘిక, పౌరాణిక నాటకాలు చూసి తీరాల్సిందే. ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు, హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్యను 1968లో ఏనుగు అంబారీపై ఎక్కించి ఊరేగించారు. అల్లు రామలింగయ్య, చిరంజీవి, కృష్ణ, రాజనాల, బ్రహ్మానందం, శ్రీహరి ఇలా ఎందరో నటీనటుల్ని సన్మానించారు. మొక్కులు చెల్లిస్తే సంతాన భాగ్యం షష్ఠి కల్యాణం రాత్రి సంతానం లేనివారు స్వామివారిని దర్శించుకుని, నాగుల చీర కట్టుకుని, ముడుపులు కడతారు. ఆలయం వెనుక భాగంలో కొద్దిసేపు నిద్రిస్తారు. సంతానం కలిగాక.. పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పిల్లలపై నుంచి బూరెలు పోసే సంప్రదాయం ఉంది. స్వామివారి ఆలయంలోకి ప్రతీ రోజు సాయంత్రం సోమసూత్రం గుండా ఒక సర్పం గర్భగుడిలోకి వచ్చి, మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని.. ఇది స్వామివారికి నిదర్శనమని ఆలయ అర్చకులు అయిలూరి శ్రీరామం తెలిపారు. ప్రతీనెలా ఈ సర్పం గర్భగుడిలో, లేదా చెరువుగట్టున కుబుసం విడుస్తూ ఉంటుంది. ఆ పాము కుబుసాన్ని అర్చకులు గర్భగుడిలో స్వామివారి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంటారు. ఈ ఏడాది షష్ఠి మహోత్సవాలు డిసెంబరు 8 నుంచి 22 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం, 9వ తేదీన షష్ఠి మహోత్సవం నిర్వహిస్తారు. కళావేదికపై ప్రతీ రోజు రాత్రి సినీ సంగీత విభావరి, బుర్రకథ, పౌరాణిక నాటకాలు, కోలాటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. తీర్ధ మహోత్సవం రాత్రి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాం షష్ఠి మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల సందర్భంగా స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశా. షష్ఠి ఉత్సవాలకు జిల్లా నలుమూలలనుంచి వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలు కల్పిస్తున్నాం. – కురెళ్ల ఉమామహేశ్వరరావు, షష్ఠి కమిటీ అధ్యక్షుడు, అత్తిలి కోరిన కోర్కెలు తీర్చే స్వామి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడు. సంతానం లేనివారు, వివాహం కానివారు స్వామివారిని దర్శించుకుంటారు. వారి కోర్కెలు స్వామి తీరుస్తాడు. ప్రతీ మంగళవారం, నెల షష్ఠి రోజున స్వామివారికి అభిషేక పూజలు నిర్వహిస్తుంటారు. – ఐలూరి శ్రీరామం, ఆలయ అ్చకులు. అత్తిలి అత్తిలి షష్ఠి ప్రత్యేకతలు ► ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున చలువపందిళ్లను నిర్మించి, విద్యుత్ దీపాలతో భారీ ఎత్తున దేవతామూర్తుల సెట్టింగ్‌లను ఏర్పాటు చేస్తారు. ► ప్రతీ ఏటా ఆలయ పరిసరాలలో పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఈ దుకాణాల్లో గృహోపకరణ, ఫ్యాన్సీ, పింగాణి, అలంకరణ వస్తువులే కాకుండా తినుబండారాల దుకాణాలు పదుల సంఖ్యలో ఉంటాయి. అలాగే భారీ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణ. ఉత్సవాల ప్రారంభంలో సుమారు 200కు పైగా దుకాణాలు ప్రతీ ఏడాది ఏర్పాటు చేస్తారు. ► షష్ఠినాడు స్వామివారి దర్శనానికి లక్ష మందికి పైగా భక్తులు జిల్లా నలుమూలలనుంచి వస్తుంటారు. మిగతా రోజుల్లో 3 నుంచి 5 వేల మంది వరకు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ► గతేడాది కరోనా నేపథ్యంలో ఉత్సవాలు సాధారణంగా జరిగాయి. ఈ ఏడాది వేలాది మంది హాజరుకానున్న దృష్ట్యా, ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా విస్తృత ప్రచారం చేపట్టారు. మాస్కు ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, జ్వరం ఉన్నవారు ఉత్సవాలకు రావద్దని భక్తులకు విజ్ఙప్తి చేశారు. -
నిధుల దుర్వినియోగం కేసు; బ్యాంకు మేనేజర్ అరెస్ట్
సాక్షి, అత్తిలి( పశ్చిమగోదావరి) : బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిన కేసులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పోతాప్రగడ రామ సూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తణుకు సీఐ డి.ఎస్.చైతన్యకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్ 2015–16 మధ్యకాలంలో బ్యాంకును మోసం చేసి రూ.37 లక్షలను స్వాహా చేశాడు. రైతుల ఆధార్‌కార్డులతో 11 జాయింట్ లయబిలిటి గ్రూపులను ఏర్పాటు చేసి, ఒక్కొక్క గ్రూపునకు రూ. 3 లక్షలు చొప్పున రూ.33 లక్షలతో పాటు మరో 8 మంది రైతుల పేరున రూ.4 లక్షలు పంట రుణాలుగా మంజూరు చేశాడు. రైతుల సంతకాలు, వ్యవసాయశాఖ మండల అధికారి సంతకాలను బ్యాంకు మేనేజర్ పోర్జరీ చేశాడు. తప్పుడు రికార్డులు సృష్టించి మొత్తం రూ.37 లక్షల బ్యాంకు నిధులను స్వప్రయోజనాల కోసం కిరణ్‌కుమార్ వాడుకున్నాడు. రైతులు పేరున తీసుకున్న రుణాలు తిరిగిచెల్లించకపోవడంతో తరువాత కాలంలో వచ్చిన మేనేజర్ రైతులకు నోటీసులు జారీ చేయడంతో నిధులు దుర్వినియోగం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్ కిరణ్‌కుమార్ బ్యాంకు నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు వచ్చి 2019 సెప్టెంబర్ 14న అప్పటి మేనేజర్ జి.శ్రీనివాస్ అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పోతాప్రగడ వెంకట రామసూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి తణుకు కోర్టుకు హాజరు పర్చగా, 2వ అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.మేరి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. -
27న వైఎస్సార్సీపీలోకి అత్తిలి మాజీ ఎమ్మెల్యే
తాడేపల్లిగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఈ నెల 27న వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు అత్తిలి మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనిం తన నివాసంలో గురువారం శ్రీరంగనాథరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో 27న భీమవరంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో జిల్లా ఎన్నికల కో–ఆర్డినేటర్‌గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించానని, అభిమానులు, అనుచరుల ఆకాంక్ష మేరకు టీడీపీకి రాజీనామా చేశానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు గుంటూరి పెద్దిరాజు, వెలగల సాయిబాబారెడ్డి, కేవీఎన్ రెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు
సాక్షి, ఉండి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పోటెత్తున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైఎస్సార్ సీపీలో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో సత్యనారాయణ, ఆయన మద్దతుదారులను వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు. వైఎస్ జగన్ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ లేరని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరినట్టు చెప్పారు. 27న వైఎస్సార్ సీపీలో చేరతా: చెరుకువాడ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మాజీ శాసనసభ్యుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 27న భీమవరం నియోజకవర్గం చిన అమిరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
వి‘చిత్ర’ నోము!
తణుకు : చిత్రగుప్తుడిని ప్రసన్నం చేసుకునేందుకు నోములు నోచే ఆచారం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ప్రాంతంలో ఉండడం విశేషం. రెడ్డి, బ్రాహ్మణ, కాపు, వైశ్య, గవర కులస్తులు రథసప్తమి రోజు నుంచి చిత్రగుప్తుడి నోములు నిర్వహిస్తుంటారు. వెదురు తవ్వలో బియ్యం, వెదురుతో చేసిన పెట్టెలో పసుపు, అల్లీఅల్లని బుట్టలో ధాన్యం నింపి వాటిలో పూజా సామగ్రి నింపి శుక్రవారం చిత్రగుప్తుని నోములు ప్రారంభించారు. అత్తిలి మండలం ఈడూరులో తులసి కోటవద్ద తొలుత ఆవు పిడకలను వెలిగించి, దానిపై పాల పొంగలి వండి ప్రసాదం తయారు చేశారు. దేవుడి నిర్దేశిత పూజా ద్రవ్యాలతో పాటు వెదురు పెట్టె, బంగారు గంటం, వెండి ఆకును ఉంచి.. పురోహితుల సాయంతో నోమును పూర్తి చేశారు. పురోహితుడు నోము నోచిన వారి పేరు గోత్రాన్ని వెండి ఆకుపై బంగారపు గంటంతో రాస్తారు. ఇలా రాయడం వల్ల చిత్రగుప్తుడి చిట్టాలో అతడి నోమును నోచుకున్నట్టు నమోదవుతుందని, తద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. -
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం
అత్తిలి : ‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం.. శ్రీరంగ ధామేశ్వరీం.. దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం’ అంటూ మహిళా లోకం సిరుల తల్లిని కీర్తించింది. ‘శ్రీలక్ష్మి.. జయలక్ష్మి.. జయము నీయవే. సతతము నిను అర్చింతుము సిరులనివ్వవే’ అంటూ ప్రార్థించింది. వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం ఇంటింటా ఘనంగా నిర్వహించారు. అత్తిలిలోని విజయ చాముండేశ్వరి అమ్మ వారిని లక్ష్మీదేవి రూపంలో అలంకరించిన దృశ్యమిది. -
అత్తిలిలో పవన్ ఫ్లెక్సి వివాదం
-
అగ్నిప్రమాదంలో ఆరు బైక్‌లు దగ్ధం
అత్తిలి : అత్తిలిలోని ఓ మోటార్ మెకానిక్ షెడ్లో గురువారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరు బైక్‌లు దగ్ధమయ్యాయి. బస్‌స్టేషన్ పక్కనే ఉన్న ఎస్సీ కాంప్లెక్స్‌లో వెంకన్న పెచ్చెట్టి జయసింగ్‌లు మోటార్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నారు. రాత్రి షాపు మూసివేసి వెళ్లిపోయిన వారికి గురువారం తెల్లవారుఝామున మూడు గంటలకు షాపు నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే షాపులో ఉన్న ఆరు బైక్‌లు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. అత్తిలి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు రూ.రెండు లక్షల ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ చెప్పారు. -
సంగీతం సేవే జీవన త్రోవగా...
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ : నేను 1918లో పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలిలో జన్మించాను. ఎస్సెల్సీ వరకు విద్యాభ్యాసం సాగింది. టైపు, షార్టుహ్యాండు నేర్చుకుని వరంగల్‌లోని అజాంజాహి బట్టలమిల్లులో స్టెనోగా ఉద్యోగపర్వం ప్రారంభించాను. 1942లో రాజమండ్రి పేపరుమిల్లులో ఉద్యోగం లభించడంతో నగరానికి వచ్చాను. ఇక సంగీతం విషయానికి వస్తే, నాకు గురువంటూ ఎవరూ లేరు. చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేది. తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్ర లేవడం అలవాటు. ఆ సమయంలో ఎవరో సంగీతం ఆలపిస్తున్నట్టు నాకు స్పష్టంగా వినిపించేది. అలా వింటూ వింటూ సాధన చేసేవాడిని. ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మను సంగీతం నేర్పమని అడి గాను..‘నేను నేర్పను, నీవు ఎవరి వద్దా నేర్చు కోవద్దు’ అని ఆయన అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒకసారి నాతో ‘శ్రీరాముడే నీకు గురువు’ అన్నారు. త్యాగరాజదాస నారాయణ సేవాసమితి నేపథ్యం బుగ్గా పాపయ్యశాస్త్రి ఆ రోజుల్లో సంగీతం ట్యూషన్లు చెప్పేవారు. ఏటానేటి విశ్వేశ్వరస్వామి ఆలయం ఎదుటి వీధిలో, తరువాత హిందూ సమాజంలో నిర్వహించే వారు. సంగీతంపై మక్కువ నన్ను.. వారికి దగ్గర చేర్చిం ది. మద్రాసు మ్యూజిక్ అకాడమీలో సంగీతంలో ప్రతి భను ప్రదర్శించడాన్ని కళాకారులు ఎలా గీటురాయిగా భావిస్తారో, రాజమండ్రి త్యాగరాజదాస నారాయణ సేవా సమితిని కూడా అలాగే భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. సమితి అభివృద్ధి కోసం శ్రీత్యాగరాజదాస నారాయణ సేవాసమితి సంస్థను రిజిస్టరు చేయడం, సమితికి వచ్చే విరాళాలకు ఆదా యపు పన్ను మినహాయింపు తేవడంలో నేను తిరిగి, విజయం సాధించాను. ఎక్కడికి వెళ్లినా, బుగ్గా పాపయ్యశాస్త్రి నడిచే వెడుతూండేవారు. ఆయనకు సైకిల్ లేదు, రాదు. నేను ఆయన్ను సైకిల్ ముందు కూర్చుండపెట్టుకుని చందాలకు తిరుగుతూండేవాడిని. ఆ రోజుల్లో పది రూపాయలు ఎవరైనా ఇస్తే గొప్ప. పదవీ విరమణ తరువాత నాకు రిటైర్మెంటు బెనిఫిట్స్ రూపేణా వచ్చిన సొమ్మును సమితికి ఇచ్చేశాను. శ్రీరాంనగరులో నాకు ఉన్న ఇంటిని అమ్మగా వచ్చిన సొమ్ములో సింహభాగం సమితికి ఇచ్చాను. నాటి మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆరేపల్లి సుబ్బారావు సమితికి సొంత స్థలం రావడానికి కృషి చేశారు. నేను, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ హైదరాబాదులో నాటి స్పెషల్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహారావును కలిశాం. ఆయన ఇచ్చిన హామీ మేరకు సమితికి సొంత స్థలం లభించింది. సమితి ప్రాంగణంలో శ్రీసీతా రామ లక్ష్మణుల మందిరంలో, ఆ దివ్యమూర్తుల సన్నిధిలో త్యాగయ్య విగ్రహాన్ని నెలకొల్పాను. సంగీత కార్యక్రమాలకు ప్రధాన వేదికగా... దేశం గర్వించదగ్గ ఎందరో సంగీత విద్వాంసులకు త్యాగరాజదాస నారాయణ సేవాసమితి ప్రధాన వేదిక అయింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ఇవటూరి విజయేశ్వరరావువంటి మహానుభావులు ఇక్కడ సత్కారాలు అందుకున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు టీఎన్ శేషుగోపాలాన్ని ఒకసారి సమితి సంగీత కార్యక్రమాలకు ఆహ్వానించాం. పారితోషికం రెండు వేల రూపాయలు దాటి ఇవ్వలేమని రాశాం. అయిదు వేలు ఇస్తేగాని రాలేనని ఆయన జాబు రాశారు. నేను ఉత్తరం రాస్తూ, ‘మీలాంటి పెద్దలను పిలవడానికి మా సమితి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నాను’ అని రాసి, ఉత్తరం కింద ఒక త్యాగరాజదాస కృతిలోని రెండు పంక్తులను ఉటంకించాను. ‘కొనియాడెడు నా ఎడ దయ- ‘వెలకు’కొనియాడెదవు సుమీ’... ఈ ఉత్తరం ఆయన మీద తీవ్రప్రభావం చూపి ఉంటుంది. నేను వస్తున్నాను అని ఆయన తెలియపరిచారు. మేము జాబు రాస్తూ, మీరు రానన్నారు కనుక, వేరొకరితో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.. వచ్చే సంవత్సరం మిమ్ములను ఆహ్వానించగలం అని తెలియపరిచాం. మరుసటి సంవత్సరం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత వ్యాసంగం ప్రచారాలకు నేను ఎన్నడూ ఆరాటపడలేదు. శ్రీరాముని దయతో తృప్తికరమైన జీవితం గడుపుతున్నాను. కళా గౌతమి సంస్థ బులుసు సాంబమూర్తి స్మారక పురస్కారంతో నన్ను సత్కరించింది. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివ రామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉగాది పురస్కారాన్ని అందుకున్నాను. అనేక సంవత్సరాలు సమితి వార్షికోత్సవాలలో త్యాగరాజస్వామి వేషంలో కీర్తనలు ఆలపిస్తూ, నగర సంచారం చేశాను. కర్మిష్ఠి జోస్యుల సూర్యనారాయణ కళత్ర వియోగం కడుపులోనే దాచుకుని, కర్తవ్యదీక్షలో ముందుకు సాగుతున్న కర్మిష్ఠి జోస్యుల సూర్యనారాయణ. తనకంటూ ఏమీ మిగుల్చుకోకపోయినా, తనదంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్న మహనీయుడు జోస్యుల నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. - చేబియ్యం వెంకట రామయ్య, సీనియర్ న్యాయవాది. సమితికి వెన్నెముక శ్రీత్యాగరాజదాస నారాయణ సేవాసమితికి వెన్నెముకగా జోస్యుల సూర్యనారాయణ నిలబడ్డారు. సమితి వ్యవస్థాపకుడు బుగ్గా పాపయ్యశాస్త్రికి చేదోడువాదోడుగా ఉండేవారు. మేము ఆయనకు సన్మానం చేసి వెండి సజ్జెను ఇస్తే, తిరిగి సమితికి ఇచ్చేశారు. రూ.25 వేల పర్సు బహూకరిస్తే, అదీ తిరిగి సమితికే ఇచ్చేశారు. సమితి నిర్వహణకు 95 ఏళ్ల వయసులోకూడా ఆయన మాకు చక్కని సూచనలను ఇస్తున్నారు. నేటికీ కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు. - వక్కలంక శ్రీరామచంద్రం, కార్యదర్శి, శ్రీత్యాగరాజదాస నారాయణ సేవాసమితి -
ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను
పాఠాలు చెప్పే గురువులు చాలామంది ఉంటారు కానీ, జీవిత పాఠాల్ని కూడా నేర్పే గురువులు మాత్రం అరుదుగా లభిస్తారు. సున్నం ఆంజనేయులుగారు అలాంటి అరుదైన వ్యక్తి. ప॥జిల్లాలోనే ఆయన ఫేమస్. ఆయన దగ్గర అక్షరభిక్ష పొంది ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు కోకొల్లలు. నేను భీమవరంలోని డీఎన్నార్ కాలేజీలో చదువుకుంటున్నపుడు ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్. గమ్మత్తేమిటంటే నేను అత్తిలి కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేసినపుడు ఆయన దానికి ప్రిన్సిపాల్. ఇలాంటి అరుదైన సందర్భం కొంతమందికే దక్కుతుంది. బుద్ధిజం, కమ్యూనిజం, లెనినిజం, హ్యూమనిటీ... ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన క్లాసంటే ఫుల్ అటెండెన్స్. పిన్ డ్రాప్ సెలైన్స్. ఎంత అద్భుతంగా పాఠాలు చెప్తారో ఆయన. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. నేను సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే, ఎందుకయ్యా కష్టాలు అని వారించారు. ఆ తర్వాత నా ఎదుగుదల చూసి చాలా సంతోషపడ్డారు. ఆయన్ని తరచుగా వెళ్లి కలుస్తుండేవాణ్ణి. ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. ఆయన సహధర్మచారిణి సున్నం శారదాదేవి కూడా మహాతల్లి. అచ్చం రామకృష్ణ పరమహంసకు శారదాదేవిలాగానే. వాళ్లు అక్షరాలతో పాటు ప్రేమను పంచిన వందలాది మందిలో నేనూ ఒకణ్ణి కావడం నా అదృష్టం. - బ్రహ్మానందం