ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను
పాఠాలు చెప్పే గురువులు చాలామంది ఉంటారు కానీ, జీవిత పాఠాల్ని కూడా నేర్పే గురువులు మాత్రం అరుదుగా లభిస్తారు. సున్నం ఆంజనేయులుగారు అలాంటి అరుదైన వ్యక్తి. ప॥జిల్లాలోనే ఆయన ఫేమస్. ఆయన దగ్గర అక్షరభిక్ష పొంది ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు కోకొల్లలు. నేను భీమవరంలోని డీఎన్నార్ కాలేజీలో చదువుకుంటున్నపుడు ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాలిటిక్స్.
గమ్మత్తేమిటంటే నేను అత్తిలి కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేసినపుడు ఆయన దానికి ప్రిన్సిపాల్. ఇలాంటి అరుదైన సందర్భం కొంతమందికే దక్కుతుంది. బుద్ధిజం, కమ్యూనిజం, లెనినిజం, హ్యూమనిటీ... ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన క్లాసంటే ఫుల్ అటెండెన్స్. పిన్ డ్రాప్ సెలైన్స్. ఎంత అద్భుతంగా పాఠాలు చెప్తారో ఆయన. నేనంటే ఆయనకు చాలా ఇష్టం.
నేను సినిమా ఫీల్డ్‌కి వెళ్తానంటే, ఎందుకయ్యా కష్టాలు అని వారించారు. ఆ తర్వాత నా ఎదుగుదల చూసి చాలా సంతోషపడ్డారు. ఆయన్ని తరచుగా వెళ్లి కలుస్తుండేవాణ్ణి. ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. ఆయన సహధర్మచారిణి సున్నం శారదాదేవి కూడా మహాతల్లి. అచ్చం రామకృష్ణ పరమహంసకు శారదాదేవిలాగానే. వాళ్లు అక్షరాలతో పాటు ప్రేమను పంచిన వందలాది మందిలో నేనూ ఒకణ్ణి కావడం నా అదృష్టం.
- బ్రహ్మానందం