
సాక్షి, ఉండి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పోటెత్తున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైఎస్సార్ సీపీలో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో సత్యనారాయణ, ఆయన మద్దతుదారులను వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు. వైఎస్ జగన్ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ లేరని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరినట్టు చెప్పారు.
27న వైఎస్సార్ సీపీలో చేరతా: చెరుకువాడ
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మాజీ శాసనసభ్యుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 27న భీమవరం నియోజకవర్గం చిన అమిరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.