సాక్షి, పశ్చిమ గోదావరి: తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో తాను సంపాదించుకున్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తనపై ఆరోపణలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై శ్రీరంగనాథ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.(‘మనసా, వాచా ఆయన వైఎస్సార్‌సీపీతో లేరు’)
ఈ నేపథ్యంలో శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు తనను, తన కుమారుడిని వ్యక్తిగతంగా దూషించడం సహా దొంగలు అని సంబోధించారంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తాను, తోటి ఎమ్మెల్యేలు, మరో మంత్రి పేర్ని నానితో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విషయాన్ని ఉదాహరిస్తూ.. "పందులే గుంపులుగా వస్తాయి" అని వ్యాఖ్యానించటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘రాజకీయ, ప్రజా జీవితంలో విమర్శలు సహజం. కానీ ఒక అవకాశవాది తన వ్యక్తిగత, స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలుచుకోలేదు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మద్దతుదారులు నా దిష్టిబొమ్మలు తగలబెట్టి వర్గ వైషమ్యాలు సృష్టించి శాంతి భద్రతలకు అవరోధం కలిగించారు.
అదే విధంగా పదే పదే మీడియా ముందు, న్యూస్ డిబేట్లలో, సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అయినా పది సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. కానీ అబద్దం చెప్పిన వ్యక్తిపై ఏ చర్య తీసుకోకపోతే అది సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని భావించాను. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా.. చట్టాలను గౌరవించే వ్యక్తిగా.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో.. న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను’’అని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment