
సాక్షి,అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు రోజూ తాగటం, వాగటమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ఆయనకు నైతిక విలువలు, ధైర్యం, రోషం ఉంటే రాష్ట్రంలోకి వచ్చి ప్రజల మధ్య తిరగాలని సూచించారు. త్వరలోనే ఆయన పాపం పండుతుందన్నారు. బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు దోచుకుతిన్న రఘురామ కృష్ణరాజు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ తక్షణమే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. అనర్హత వేటు నోటీస్ ఇచ్చినప్పుడల్లా తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లేదని, ఏ తప్పూ చేయలేదని నమ్మబలుకుతున్నారని, ఢిల్లీలో ఎల్లో మీడియాతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో ఆయన నిజ స్వరూపం బయటపడిందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనతోపాటు ఒక పద్ధతి, విధానం లేని రఘురామకృష్ణరాజుకు బుద్ధి చెప్పేలా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే వైఎస్సార్‌సీపీ ఆయన్ను విడిచిపెట్టబోదని హెచ్చరించారు.
దిగజారుడు వ్యక్తి..
రఘురామకృష్ణరాజు రాక్షస బ్యాచ్‌తో చేరి శునకానందం పొందుతున్నారని నందిగం సురేష్ ధ్వజమెత్తారు. ఆయన ఓ నయవంచకుడు, దిగజారిన మనిషి అని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే రాజకీయాలు ప్రమాదకరంగా మారుతాయన్నారు. ఆయనపై సీబీఐ, ఏసీబీ కేసులున్నాయని, వాటి నుంచి బయటపడేందుకు ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన్ను ఎవరూ కాపాడలేరని, జైలుకెళ్లక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజుకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సూచించారు. ఢిల్లీలో మకాం వేసిన పిచ్చి కుక్క లాంటి ఆయన్ను అంతమొందించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. సీఎం జగన్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టివేశారని తెలిపారు. సీఎం జగన్ రాముడు లాంటి వ్యక్తి కాబట్టే ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
రాజకీయ వ్యభిచారి ..
రఘురామకృష్ణరాజు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, బ్యాంకులను మోసగించిన ఆయనకు రుణాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని ఎంపీ సురేష్ చెప్పారు. ఢిల్లీలో కూర్చుని ప్రెస్‌మీట్లు కాకుండా రోషం, ఆత్మగౌరవం, పౌరుషం ఉంటే ఏపీకి వచ్చి మాట్లాడాలన్నారు. అవకాశం రావడంతో మూడేళ్లు పబ్బం గడుపుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నీ గాలికి వదిలేసిన చంద్రబాబు, రాఘురామ, ఎల్లో మీడియాను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి వారిని ఛీ కొట్టడం ఖాయమన్నారు.