మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే, ఎంపీ సురేష్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని ప్రాంతంలో దళితులకు చేసిన అన్యాయం వెలుగులోకి రాకుండా ఎల్లో మీడియా కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఆంధ్రజ్యోతి, ఈనాడు నిస్సిగ్గుగా వ్యవహ రించాయని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. అన్యాయం చేసిన వాళ్లను కాపాడటం స్టింగ్ ఆపరేషన్ ఎ లా అవుతుందని ప్రశ్నించారు. సీఐడీకి ఫిర్యాదు చేసిన రైతులను అదిరించి, బెదిరించి తమకు అనుకూలంగా చెప్పించుకున్నారని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
బెదిరించి జబ్బలు చరుచుకుంటున్నారు: ఆర్కే
ల్యాండ్ పూలింగ్ పేరుతో తమను చంద్రబాబు మోసగించారని రైతులు నాకు చెప్పారు. దీన్ని సీఐడీ అధికారులూ రికార్డు చేశారు. ఇప్పుడు వాళ్లను బెదిరించి, అనుకూలంగా మాట్లాడించి స్టింగ్ ఆపరేషన్ అని జబ్బలు చరుచుకోవడం ఆ రెండు పత్రికలకే చెల్లింది. చంద్రబాబు మోసం చేశారని 2015 అక్టోబర్‌లో పలువురు దళిత రైతులు చెప్పినట్లు పత్రికల్లో వచ్చింది. 2016 ఫిబ్రవరి 19న సీపీఎం నేత బాబురావుతో కలసి దళితులకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో అప్పటి ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. మరికొంతమంది దళితులు కూడా అన్యాయంపై సీఐడీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడుకు దమ్ము ధైర్యం ఉంటే చట్టాలను అతిక్రమించి చంద్రబాబు దళితులను ఎలా మోసగించారో వెలుగులోకి తేవాలి.
దళితులను తరిమేసే కుట్ర: నందిగం సురేష్
రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన మోసాలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి కనిపించకపోవడం దారుణం. అసైన్డ్ భూములకు ఏమీ ఇవ్వకుండా తీసుకుంటారని టీడీపీ నేతలు దళితులను భయపెట్టారు. వాళ్ల నుంచి భూములన్నీ చంద్రబాబు, ఆయన బినామీలు తీసుకున్నాక అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలు చెల్లుతాయ ని జీవో 41 ఇచ్చారు. అసైన్డ్ రైతులను ముష్టివారి కంటే హీనంగా చూశారు. రాజధాని శంకుస్థాపన సమయంలో దళితులను ఆ ప్రాంతానికి కూడా రానివ్వకుండా వేల మంది పోలీసులను అడ్డుపెట్టారు. చంద్రబాబు సామాజిక వర్గాన్ని మాత్రం సగర్వం గా సత్కరించి ఆహ్వానించారు. దళితులను నిజాలు చెప్పనివ్వకుండా బెదిరిస్తున్నారు. పచ్చ మీడియా సిగ్గూ శరం వదిలేసి అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. రాజధానిలో దళితులు, మైనార్టీలు, బీసీలు ఉండకూడదనేదే టీడీపీ దురాలోచన.
Comments
Please login to add a commentAdd a comment