నిర్బంధాలతో ఆపలేరు | nobody can stop ys jagan mohan reddy hunger strike, says ambati rambabu | Sakshi
Sakshi News home page

నిర్బంధాలతో ఆపలేరు

Published Mon, Aug 26 2013 2:41 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నిర్బంధాలతో ఆపలేరు - Sakshi

నిర్బంధాలతో ఆపలేరు

సాక్షి, హైదరాబాద్: ‘‘జైలు గోడలు, పోలీసు నిర్బంధాలు, బెదిరింపులు ఒక మనిషిని ఆపుతాయేమోగానీ, మనసును మాత్రం ఆపలేవు. నిర్బంధంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను, వారి కష్టనష్టాలను, మనోభావాలను గుర్తెరిగి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడి ్డ చిత్తశుద్ధితో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అందరూ మద్దతు పలకాలి’’ అని పార్టీ అధికార ప్రతినిధి, సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఒక సమస్య పరిష్కారానికి పట్టుదలతో నిరాహార దీక్ష చేపట్టిన జగన్ అభినందనీయుడని ఆయన వ్యాఖ్యానించారు. జనంలో లేకపోయినా, జైల్లో ఉన్నా ప్రజల పక్షాన పోరాడగలిగినటువంటి చిత్తశుద్ధి ఒక్క జగన్‌కే ఉందని, తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలిగిన ఒకే ఒక్కడు జగన్ అని చెప్పుకోవడానికి తాము గర్వపడుతున్నామన్నారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 పోరాటంలో ముగ్గురు నేతలూ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల ముగ్గురూ ప్రజా సమస్యల పోరాటంలో ముందుండటం తమకు గర్వకారణంగా ఉందని అంబటి అన్నారు. జైల్లో ఉన్న జగన్ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటే షర్మిల త్వరలో ఇదే సమస్యపై బస్సు యాత్రను చేపట్టబోతున్నారని, నిన్నటి వరకూ విజయమ్మ గుంటూరులో సమరదీక్ష చేశారని ఆయన చెప్పారు. ప్రజల పట్ల చిత్తశుద్ధితో మొక్కవోని విశ్వాసంతో జగన్ దీక్షకు పూనుకుంటే కొన్ని పత్రికలు, కొన్ని టీవీ చానళ్లు ఆయనపై విషప్రచారానికి పూనుకోవడం దురదృష్టకరమని అంబటి అసహనం వ్యక్తంచేశారు. దీక్ష చేస్తే ములాఖత్‌లు రద్దు చేస్తారని, దీక్ష చేయడానికి జైలు నిబంధనలు అంగీకరించవని శనివారం నుంచీ దుష్ర్పచారం చేశాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తున్న చానళ్లు కూడా జగన్‌పై బురదజల్లుతున్నాయని విమర్శించారు. దీక్షకు జైలు నిబంధనలు అంగీకరించవని కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని, ఎవరైనా వెళ్లి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానంటే ప్రభుత్వం అనుమతిని ఇస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.
 
 గాంధీజీ ఇచ్చిన సాధనమిది: నిరవధిక నిరాహారదీక్ష చేయడం అనేది ఈరోజు కొత్తగా రాలేదని ఒక సమస్యపై పోరాడే హక్కు స్వాతంత్య్రోద్యమంలో మహాత్మాగాంధీ మనకు ఇచ్చిన సాధనమని అంబటి అన్నారు. ఆనాడు గాంధీజీ నిరాహార దీక్ష చేస్తానంటే బ్రిటిష్ వారు అనుమతిని ఇచ్చారా అని ఆయన అన్నారు. గాంధీజీ అప్పట్లో ఐదు సార్లు జైల్లో ఉండే నిరాహార దీక్ష చేశారని ఆయన ఉదహరించారు. జగన్ కూడా ఇపుడు ఒక ప్రజా సమస్య పట్ల చిత్తశుద్ధితో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారని అన్నారు. చంచల్‌గూడ జైల్లో జగన్ దీక్ష చేయకూడదని కొందరు నేతలు చెప్పడాన్ని ప్రస్తావించగా దీక్ష చేయడానికి హరీష్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేసీఆర్ వంటి వారి అనుమతి జగన్‌కు అవసరం లేదని అంబటి అన్నారు. తెలంగాణపై వెనక్కి వెళ్లబోమని సోనియా చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ సోనియా, సీడబ్ల్యూసీ తెలంగాణపై వెనక్కి వెళ్లరు, పార్లమెంటులో కూడా ఆ బిల్లు ఆమోదం పొందదు అని వ్యాఖ్యానించారు.
 
 బాబు వైఖరేంటో చెప్పించండి: విజయమ్మ దీక్షలు చేస్తున్నారంటే పోటీ దీక్షలకు దిగిన టీడీపీ నాయకులు తమ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరి ఏమిటో వెల్లడించేలా చేయాలని అంబటి కోరారు. ఏపీఎన్జీవోలు వెళ్లి అడిగితే తెలంగాణపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోను అని చెప్పిన చంద్రబాబును ప్రశ్నించాలని అన్నారు. నిత్యం జనం మధ్య తిరిగే వ్యక్తినని, పాదయాత్ర కూడా చేశానని చెప్పుకుంటున్న బాబు ఆత్మగౌరవ యాత్ర కాస్తా తుస్సు యాత్రగా మారిందని అంబటి ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవ యాత్రకు వచ్చి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో, ఈ సమస్యపై స్పందించలేని దౌర్భాగ్యమైన స్థితిలో బాబు ఉన్నారని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ఇంకా పెట్టకముందే టీడీపీ ఎంపీలు అక్కడ స్తంభింపజేయడం కేవలం ప్రచారం కోసమేనన్నారు. చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకుండా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు గందరగోళం సృష్టించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement