
శాంపిళ్లూ నొక్కేస్తున్నారు!
సాక్షి, గుంటూరు
జిల్లాలో నరసరావుపేట కేంద్రంగా ‘శాంపిల్ మందుల ముఠా’ దందా నడుస్తోంది. తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట వంటి పట్టణాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమ వ్యాపారం సాగిస్తోంది.
ముందుగా ఇతర రాష్ట్రాల నుంచి నరసరావుపేటలోని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలకు వీటిని దిగుమతి చేసుకుంటారు. నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మసెంటర్, పల్నాడు బస్టాండ్, రామిరెడ్డిపేట, తెనాలిలో సుల్తాన్‌బజార్, గంటలమ్మచెట్టు వీధి, చెంచుపేట తదితర ప్రాంతాల్లో శాంపిల్స్ విక్రేతలు వీటిని గోడౌన్‌లలో నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు చేరవేస్తుంటారు.
ముఖ్యంగా గర్భిణులు వాడే ఐరన్ మాత్రలు, సిరప్‌లు, బలానికి వాడే బీకాంప్లెక్స్ మాత్రలు, బిడ్డల ఎదుగుదలకు వాడే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు, పిల్లల దగ్గుకు వాడే సిరప్స్, యాంటీబయాటిక్స్, జీర్ణసంబంధిత మందులు, నులిపురుగుల మాత్రలు, జ్వరాలు, విషజ్వరాలు, నొప్పులు, కామెర్లు, హెల్తీఫుడ్ తదితర మందులు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి.
గుంటూరుతోపాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు సైతం ఇక్కడ నుంచే మందులు సరఫరా అవుతున్నాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులు, అధికారుల మధ్య ఈ ముఠా లాబీయింగ్ నడిపి రూ. కోట్లు గడిస్తోంది.
లెసైన్స్ లేని వ్యాపారం..
తాము తయారు చేసే మందులు ఎలా పనిచేస్తున్నాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుంది. రోగులకు ఉపయోగపడతాయా, లేదా తదితర విషయాల్ని తెలుసుకున్న తరువాతే కంపెనీలు తమ ఉత్పత్తుల్ని మార్కెట్‌లోకి తేవాలని మందుల కంపెనీలు చూస్తుంటాయి.
తమ ఉత్పత్తులకు అధిక ప్రచారం కావాలనే ఉద్దేశంతో కంపెనీల కొన్ని శాంపిళ్లను డాక్టర్లకు ఉచితంగా అందజేస్తారు. వీటిని కంపెనీలు తమ మెడికల్ ప్రతినిధుల ద్వారా మార్కెట్‌లోకి పంపిస్తాయి. వాటిని వైద్యులకు ఇవ్వకుండా.. ఇచ్చినా అరకొర మాత్రమే అందజేసి మిగిలినవి వ్యాపారులకు విక్రయిస్తుంటారు.
వ్యాపారులు ఈ వ్యాపారానికి ఎలాంటి లెసైన్స్ తీసుకోవడం లేదు. మెడికల్ రిప్‌లు, కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన శాంపిళ్లను మండలాల్లోని మెడికల్ షాపులు, ఆర్‌ఎంపీ డాక్టర్‌లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెడికల్ దుకాణాలకు, ఆర్‌ఎంపీలకు 50 శాతం ధరకే విక్రయిస్తారు. వారు 100, 150 శాతానికి విక్రయిస్తారు.
దాడులు ఏవీ ?...
చాపకింద నీరులా విస్తరిస్తున్న మందుల జీరో వ్యాపారం ఔషధ నియంత్రణ శాఖకు తెలియంది కాదు. అధికారులు ఈ ముఠాతో ముందుస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుని, దాడులకు పాల్పడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాంపిల్ మందుల విషయం ప్రస్తావనకొచ్చినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లమధ్యలో, దూరప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటుంటే తమకెలా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే వ్యాపారులపై చర్యలు చేపడతామంటూ చేతులెత్తేయడం వీరికి పరిపాటిగా మారింది.