సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నామినేటెడ్ పదవుల కోసం కమలనాథులు పోటీపడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ నేతలకు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని నామినేటెడ్ పదవుల్లోనూ టీడీపీ నేతలతో సమానంగా బీజేపీ నేతలకూ ఇవ్వాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ, బీజేపీల మధ్య అంతర్గత పోరు తీవ్రమైంది. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అధికార టీడీపీ వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 11 మార్కెట్ కమిటీలు, 7 దేవాలయ కమిటీలు, ఆర్టీసీ, నూడా, గ్రంథాలయ, ఎమ్మెల్సీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. వీటితో పాటు వెయ్యికిపైగా చిన్న దేవాలయాలు, మహిళా కమిషన్, ఫుడ్ కార్పొరేషన్, చేనేత, జౌళి, షిప్పింగ్ తదితర వాటిల్లో డెరైక్టర్ల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. గత ఏడాది నవంబర్‌లో భర్తీ చేయాల్సి ఉన్నా..
కమలనాథులు పోటీ పడుతుండడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నారు. జిల్లాలో రూ.కోటికిపైగా ఆదాయం వచ్చే ఆలయాలు ఏడు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆలయాలైన సూళ్లూరుపేట చెంగాళమ్మ, నెల్లూరులోని రంగనాయకులస్వామి దేవాలయం, పెంచలకోన నరసింహస్వామి, జొన్నవాడ కామాక్షమ్మ, నర్రవాడ వెంగమాంబ, తూర్పు కనుపూరు ముత్యాలమ్మ, నరసింహస్వామి ఆలయ కమిటీలు ఉన్నాయి. వీటిలో ఐదు కోర్టు పరిధిలో ఉన్నాయి. మిగిలిన రెండు ప్రధాన ఆలయ కమిటీ చైర్మన్ పదవులు బీజేపీకి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
అదేవిధంగా గూడూరు, నాయుడుపేట, రాపూరు, నెల్లూరు, వాకాడు, కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి, పొదలకూరు, ఆత్మకూరు, కావలి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో ఉదయగిరి, కావలి, వెంకటగిరి మార్కెట్ కమిటీలు భర్తీ చేశారు. మిగిలిన ఎనిమిదింటిలో రెండు ప్రధాన కమిటీ చైర్మన్ పదవులు తమకు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు దేవాలయాలు, మార్కెట్ కమిటీ సభ్యుల నియామకాల్లో ప్రతి కమిటీకి ఇద్దరు బీజేపీకి చెందిన వారికి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు.
ఒక ఎమ్మెల్సీ మాకు ఇవ్వండి..
జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు పదవులు కేటాయించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ రెండింటికీ టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు వాటిలో ఒక ఎమ్మెల్సీ తమ వారికి కట్టబెట్టమని తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీలు బీజేపీకి కేటాయిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఒక ఎమ్మెల్సీ నెల్లూరుకు చెందిన బీజేపీ నేతలకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా కార్పొరేషన్‌లో ‘నూడా’ చైర్మన్ పదవికి పోటీ నెలకొంది. ఈ పదవిని దక్కించుకునేందుకు అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీలో అనూరాధ, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, బీజేపీ నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీప నూడా పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి ఆ స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. జిల్లా అధ్యక్షపదవికి పలువురు టీడీపీ నేతలు పోటీపడుతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫుడ్ కార్పొరేషన్ డెరైక్టర్, షిప్పింగ్, చేనేత, జౌళి, మహిళా కమిషన్ పదవులన్నింటినీ బీజేపీ నేతలే దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య నామినేటెడ్ పదవుల కోసం అంతర్గత యుద్ధం జరుగుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మాకూ పదవులివ్వాల్సిందే
Published Sat, Feb 21 2015 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement