
రాజంపేట, ఆకేపాడు ప్రాంతాల్లో నేలకొరిగిన అరటితోట
పంటలు బాగా పండి, కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశించిన అన్నదాతకు ఈ ఏడాది నిరాశే మిగులుతోంది.ఆరుగాలం శ్రమించినా ఆవేదన తప్ప ఆనందం లేదు. కరువు, వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు దెబ్బమీద దెబ్బతీస్తున్నాయి. కష్టాల సాగులో కన్నీళ్లే మిగులున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. చేతికంది వచ్చిన పంటలు కళ్లముందే నేలకొరిగాయని వాపోతున్నారు.
కడప అగ్రికల్చర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. శనివారం ఉదయం వరకు సరాసరి జిల్లా వ్యాప్తంగా 44 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా 340 ఎకరాల్లో (136 హెక్టార్లు) పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతుండగా, అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 ఎకరాల్లో అరటి, మామిడి, కూరగాయ పంటలు, ఉల్లి, బొప్పాయి, ఆకుతోటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.
136 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
వర్షానికి జిల్లాలోని పలు మండలాల్లో అరటి, మిరప, బీర,ఉల్లి పంటలు 118 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. దీని కారణంగా రూ.1.75 కోట్ల దిగుబడికి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. రాజంపేట ఉద్యానశాఖ–2 డివిజన్‌లోని రైల్వేకోడూరు మండలం బొజ్జవారిపల్లె, తూర్పుపల్లె, ఉర్లగడ్డపోడు, ఎగువసూరపుపల్లి, వీపీఆర్ కండ్రిగ, కాపుపల్లి, నారాయణవారిపోడు, ఒ.కొత్తపల్లె గ్రామాల్లో 20 హెక్టార్లలో అరటి పంట దెబ్బతినడంతో రూ.30లక్షల నష్టం సంభవించింది.
అలాగే ఓబుళవారిపల్లె మండలం వై.కోట, పెద్ద ఓరంపాడు, బొమ్మవరం, కోర్లకుంట గ్రామాల్లో 40 హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగి రూ.60 లక్షలు ఆదాయాన్ని రైతులు కోల్పోయారు. పుల్లంపేట మండలంలో ఉడుంవారిపల్లె, పెనగలూరు మండలం దామనచర్ల, రాజంపేట మండలం ఆకేపాడు, చెర్లోపల్లె గ్రామాల్లో అరటి, మిరప పంటలు 58 హెక్టార్లలో దెబ్బతినగా రూ.58 లక్షల నష్టం వాల్లింది. అలాగే కడప ఉద్యానశాఖ–1 పరిధిలోని సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లె, పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామాల్లో బీర, ఉల్లి పంటలు 0.88 హెక్టార్లలో దెబ్బతినగా రూ.88 వేలు నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment