సాక్షి, అనంతపురం టవర్ క్లాక్: వాహనదారులకు పారదర్శక సేవలు అందించాలన్న లక్ష్యంతో రవాణాశాఖలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చినా అవినీతిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. కార్యాలయ సమీపంలో తిష్టవేసిన దళారులే కథ అంతా నడిపిస్తున్నారు. వారి ద్వారా వెళ్లే ఫైల్లు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. నేరుగా వాహనదారులు ఎల్‌ఎల్‌ఆర్, వాహన రిజిస్ట్రేషన్‌కు వెళితే...నిబంధనల పేరుతో అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. అదే దళారుల ద్వారా వెళితే నిమిషాల్లో పనిచేసి పెడుతున్నారు.
దందా సాగుతోందిలా..
ఒకరిపేరుతో ఉన్న వాహనాన్ని మరొకరి పేరుపైకి మార్చేందుకు గానీ, వాహనానికి ఎఫ్‌సీ చేయించేందుకు కానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పడు మెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంది. ఈ మెయిల్ ఐడీనే దళారులు దందాకు ఉపయోగించుకుంటున్నారు. వాహనదారుడి మెయిల్ ఐడీకి బదులుగా ఏజెంట్ పేరుతో ఉన్న మెయిల్ ఐడీని ఇస్తారు. అధికారులకు కూడా ఇదే సీక్రెట్ కోడ్‌గా మారింది. ఏ మెయిల్ నుంచి ఎన్ని వాహన రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఎల్‌ఆర్‌లు, ఎఫ్‌సీ, లైసెన్స్ రెన్యూల్స్ వచ్చాయో తెలుసుకుంటున్న అధికారులు.. దళారులను ఏజెంట్ల వద్దకు పంపి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో ఈ దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది.
ఒక్కో పనికి ఒక్కోరేటు
ఆర్టీఏలో పనినిబట్టి ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిన్న వాహనాలకు ఒక రేటు, పెద్ద వాహనాలకు ఒక రేటు నిర్ణయించారని సమాచారం. ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా, దళారులు, అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లలతో పాటు తాము తీసుకునే మొత్తాన్ని ఏజెంట్లు వాహనదారుల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తారు. ఎల్‌ఎల్‌ఆర్, పర్మినెంట్ లైసెన్స్ వరకూ భారీగా వసూళ్లు చేస్తున్నారు. ఇక ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) పొందేందుకు వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఒక్కో లగేజీ ఆటో ఎఫ్‌సీ చేసేందుకు ప్రభుత్వ చలానా, ఏజెంటు, దళారి మామూళ్లతో పాటు అధికారులకు ఇచ్చే ముడుపు అంతా కలిపితే రూ.5,200 నుంచి రూ.6 వేలు వరకు తీసుకున్నట్లు సమాచారం. పెద్ద వాహనాలకు ఎఫ్‌సీ చేయించాలంటే రూ.10 వేలు నుంచి రూ. 15 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బస్సుకు ఎఫ్‌సీ చేయించాలంటే అధికారులకే రూ. 3 వేలు అదనంగా ఇవ్వాల్సి ఉంటోందని వాహనదారులు వాపోతున్నారు.
ఇతర రాష్ట్రాల వాహనాల బదిలీకి భారీరేటు
ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను ఇక్కడకి బదిలీ చేయించాలంటే భారీగా ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇతర రాష్ట్ర వాహనాలను కొనుగోలు చేయగానే వాహనం ఐడీఎల్ రద్దు అవుతుంది. అక్కడి నుంచి ఎన్‌ఓసీ తీసుకుని మన రాష్ట్రంలోకి ఆ వాహనం తీసుకురావచ్చు. ఆ ఎన్‌ఓసీ ఒక్కరోజు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత బదిలీ చేయించుకొన్న తర్వాతే వాహనం రోడ్డు మీద తిప్పాల్సి ఉంటుంది. ఇలా ఇతర రాష్ట్రాల వాహనాలు బదిలీ చేసే సమయంలో ఏజెంట్‌లు భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రవాణాశాఖ మంత్రి హెచ్చరించినా...
ఆర్టీఏలో జరుగుతున్న అవినీతి తంతుపై కొందరు ఫిర్యాదు చేయగా..నేరుగా రవాణ శాఖ మంత్రే ఉన్నతాధికారికి ఫోన్ చేసి హెచ్చరించారు. అయినప్పటికీ కార్యాలయంలో వసూళ్ల దందా మాత్రం ఆVýæకపోవడం విశేషం.
50కి పైగా ఏజెంట్ కార్యాలయాలు
ఆర్టీఏ కార్యాలయం సమీపంలో 10కిపైగా ఆన్‌లైన్ సెంటర్లు, 50కిపైగా ఏజెంట్ కార్యాలయాలు ఉన్నాయి. ఏజెంటు కార్యాలయాలన్నీ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోనే హమాలీకాలనీలో నివాసాల మధ్య ఏర్పాటు చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో దళారుల నుంచి వెళ్లిన ఫైల్లు మాత్రమే అధికారులు ఆమోదిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా వాహనదారుడు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని నేరుగా కార్యాలయంలోకి వెళితే వారి పనులు జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బడి బస్సుల ఎఫ్‌సీలోనూ చేతివాటం
జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 1,226 స్కూల్ బస్సులున్నాయి. వీటిలో వాడుకలో ఉన్నవి 1,060 బస్సులని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటి దాకా 770 బస్సులు మాత్రమే ఎఫ్‌సీ సర్టిఫికెట్ పొందాయి. ఇంకా 456 బస్సులు ఎఫ్‌సీ చేయించుకోవాల్సి ఉంది. ఒక్కో బస్సు ఎఫ్‌సీకి దళారుల ద్వారా రూ.3 వేల వరకూ అధికారులు వసూలు చేసినట్లు సమాచారం.
ఆన్‌లైన్ సేవలతో దళారులకు చెక్ పెట్టాం
ఆర్టీఏలో దళారులకు చెక్ పెట్టేందుకు సేవలన్నీ ఆన్‌లైన్ చేశాం. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి వాహనదారులు సేవలు పొందవచ్చు. అధికారుల పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తుంటే నాకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఇతర రాష్ట్రాల వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో దళారులు పెద్ద ఎత్తున డబ్బు తీసుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు.
– సుందర్‌వద్దీ, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment