
వ్యవసాయ పరికరాలు ఏవీ?
సాక్షి ప్రతినిధి
గుంటూరు: ఖరీఫ్ సీజన్ సగం దాటినా వ్యవసాయ పరికరాల సరఫరా జరగలేదు. రైతులకు ఉపయోగపడే పవర్ స్ప్రేయర్లు, టిల్లర్లు, టార్పాలిన్లు, వరికోత మెషీన్లను సీజన్‌కు ముందే రైతులకు సరఫరా చేసే విధానం అమలులో ఉంటే ఇంత వరకు టెండర్లే ఖరారు కాలేదు. వీటి సరఫరాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలల క్రితమే రూ. 316 కోట్లను విడుదల చేస్తే సరఫరాదారులతో సంప్రదింపులు, బేరసారాలు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో ముందుగా వరినాట్లు వేసినవారు, గుంటూరులో పత్తి సాగుచేసిన రైతులు పవర్ స్ప్రేయర్ల కోసం అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నా ఫలితం కనపడటం లేదు.
వ్యవసాయ పరికరాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం రూ. 226 కోట్లు, రాష్ట్ర ఫ్రభుత్వం రూ.ణూూ90 కోట్లను ఈ ఏడాది కేటాయించింది.
నాగళ్లు, పవర్ స్ప్రేయర్లు, రొటోవేటర్లు, ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, టార్పాలిన్లు తదితర పరికరాలను సరఫరా చేసేందుకు మే నెలలో టెండర్లు ఆహ్వానించారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక సంస్థలు వీటిని సరఫరా చేసేందుకు ముందుకు వచ్చి, సరఫరా చేయదలిచిన రేటును ఆ టెండరులో పేర్కొన్నాయి.
నాలుగు నెలల నుంచి ఈ టెండర్ల పరిశీలన, సరఫరాదారులతో సంప్రదింపులంటూ వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో వరినాట్లు పడి దాదాపు మూడు నెలలు కావస్తోంది.
అక్కడి వరి, గుంటూరులోని పత్తి తెగుళ్ల నివారణకు పవర్ స్ప్రేయర్లు అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం వీటిని ఇంతవరకు సరఫరా చేయకపోవడంతో రైతులు మార్కెట్‌లో లభిస్తున్న స్ప్రేయర్లను పూర్తి రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
అధికారులు వీటిని సరఫరా చేసి ఉంటే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని చెల్లించేవారమంటున్నారు. ఇప్పటికైనా వీటి వినియోగానికి అనువుగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వరికోత, నూర్పిళ్ల యంత్రాలు, పట్టాల సరఫరాలో కొంత ఆలస్యం జరిగినా నష్టం ఉండదని రైతులు చెబుతున్నారు.
వరి కోతకు మరో రెండు నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలోపే వరికోత మెషీన్లు, నూర్పిడి యంత్రాలు, పట్టాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వీటి సరఫరాకు టెండర్లు ఖరారు అయితే సరఫరాకు రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది కాబట్టి రైతులు ఈ సీజనులో వాటిని వినియోగించే అవకాశం ఏర్పడుతుందని అదికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వీటిని పరిశీలనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.