సార్వత్రిక భేరి
- విడుదలైన నోటిఫికేషన్
- తొలిరోజు ఏడు నామినేషన్లు
- నేడు, రేపు సెలవు
- మళ్లీ మంగళవారమే ఛాన్స్
- విస్తృత బందోబస్తు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల మహా సంగ్రామానికి తెరలేచింది. సాధారణ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. తొలి రోజు విశాఖ పార్లమెంట్ స్థానానికి ముగ్గురు స్వతంత్రులు, 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
వాస్తవానికి నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 19వ తేదీ వరకు గడువున్నప్పటికీ ఈ నెల 13, 14, 18వ తేదీలు సెలవులు కావడంతో కేవలం అయిదు రోజులు మాత్రమే నామినేషన్లను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన 15 నిమిషాలకు విశాఖ ఎంపీ స్థానానికి ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. రోణంకి చలపతిరావు ఎటువంటి హడావుడి లేకుండా వచ్చి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు నామినేషన్‌ను సమర్పించారు.
తణుకు దివాకర్, గేదెల కృష్ణారావులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. విశాఖ-తూర్పు నియోజకవర్గానికి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి సంతానం గోవిందరాజులు తన అనుచురులతో ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చారు. విశాఖ-తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావుకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. సూర్యాబాగ్ ప్రాంతంలో ఉన్న జీవీఎంసీ జోన్-3 కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశాఖ-దక్షిణ నియోజకవర్గం ఆర్‌ఓ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా అమ్ములోజు రామ్‌మోహనరావు, అనకాపల్లికి పూసర్లరాజా, అరకుకు ఎల్.బి.వెంకటరావులు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు.
బందోబస్తు : రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఆర్‌ఓ కార్యాలయాలకు వంద మీటర్లులోపే అభ్యర్థుల అనుచరులను, వాహనాలను నిలిపివేస్తున్నారు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే నామినేషన్ సమర్పణ కు ఆర్‌ఓ కార్యాలయానికి పంపిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద గేటు బయట వరకు మాత్రమే ర్యాలీలను అనుమతిస్తున్నారు. లోపలకు కేవలం ఒక వాహనం, అయిదుగురిని మాత్రమే అనుమతించారు. ఆదివారం, సోమవారం సెలవు రోజులు కావడంతో మంగళవారం తిరిగి నామినేషన్ల సందడి ఉండనుంది.