సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ ఖాళీల భర్తీపై దృష్టి పెట్టకుండా నిరుద్యోగులను నిలువునా వంచించిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త డ్రామాలకు తెరతీస్తోంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని మభ్యపెడుతోంది. 2 లక్షలకు పైగా ఖాళీలుండగా, కేవలం 18,450 పోస్టులనే భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. వచ్చే ఎన్నికలోలబ్ధి కోసమే ప్రభుత్వం ఆరాట పడుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
రూల్–7 రద్దుతో నిరుద్యోగులకు షాక్
తాము అధికారంలోకి వస్తే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, ప్రతిఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల దాకా ఖాళీల భర్తీ ఊసే ఎత్తలేదు. 2016 జూన్ 17న జీఓ నెంబర్ 110ను విడుదల చేసి, 10 వేల పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు. అందులో 4,009 పోస్టులను ఏపీపీఎస్సీతో, 5,991 పోస్టులను పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తామన్నారు.
జీఓ 110కు సవరణల పేరిట కాలయాపన చేశారు. డిసెంబరు ఆఖరు నాటికి కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఏపీపీఎస్సీకి అప్పగించిన వాటిలో కేవలం 2 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందుకు కారణం ఏపీపీఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి అనుకూలంగా ఉన్న రూల్–7ను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలగించడమే. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరకపోయినా, వేరే కొలువు వచ్చి రిజైన్ చేసినా ఖాళీ అయ్యే ఆయా పోస్టులు రూల్–7తో మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు వచ్చేవి.
చంద్రబాబు ఈ రూల్–7ను రద్దు చేశారు. మిగిలిపోయిన పోస్టులనే మళ్లీ కొత్త నోటిఫికేషన్లలో కలిపేస్తున్నారు. 18,450 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రూల్–7ను రద్దు చేయడంతో ఈ పోస్టుల్లోనూ భర్తీ చేసేవి తక్కువే కానున్నాయి.
ఎన్ని పోస్టులను కుదిస్తారో!
2016 తరువాత మళ్లీ ఒక్క నోటిఫికేషన్‌కు కూడా చంద్రబాబు అనుమతివ్వలేదు. 2 లక్షలకు పైగా ఖాళీలు ఉండగా, 70 వేలు మాత్రమే ఉన్నాయని, అందులో కేవలం 20 వేలు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలంటూ ఆయా శాఖాధిపతులు పంపించిన నివేదికలను బుట్టదాఖలు చేశారు. విద్యాశాఖలో 30 వేలకు పైగా ఖాళీలుండగా, అందులో 14 వేల పోస్టుల భరీకి అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ ప్రతిపాదనలు పంపితే తిరస్కరించారు.
త్వరలో ఎన్నికలు రానుండడంతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లంటూ సీఎం చంద్రబాబు మభ్యపెడుతున్నారు. కేవలం 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా అనుమతిచ్చారు. ఇందులో కూడా నోటిఫికేషన్ల నాటికి ఎన్ని పోస్టులను కుదిస్తారోనన్న అనుమానాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్ ఆఖరు నాటికి గానీ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం లేదు. 2019లో మాత్రమే ఈ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుంది. అప్పటికింకా ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
నిర్దాక్షిణ్యంగా ఊస్టింగ్‌లు
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగులనే నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తప్పించింది. ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు.. ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న 1.50 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment