‘సంప్రదాయం’గా వస్తేనే.. శ్రీవారి దర్శనం
⇒ ప్రస్తుతం ఆర్జిత సేవలు, వీఐపీ, రూ.300,రూ.50 సుదర్శనంలో డ్రస్‌కోడ్ అమలు
⇒సర్వదర్శనం, కాలిబాట దర్శనంలోనూ తప్పనిసరి చేయాలని టీటీడీ యోచన
సాక్షి, తిరుమల : సనాతన హైందవ ధర్మాలు, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేయాలని టీటీడీ సంకల్పించింది. ఇప్పటికే ఆర్జిత సేవలు, వీఐపీ, రూ.300, రూ.50 సుదర్శనంలోనూ ఇదే విధా నం అమలు చేస్తున్నారు. మిగిలిన సర్వదర్శనం, కాలిబాట దర్శనంలోనూ సంప్రదాయ దుస్తులను అమలు చేయాలని భావిస్తున్నారు.
ఫలితాలిస్తున్న సంప్రదాయ వస్త్రధారణ
రెండు దశాబ్దాలకు ముందు సంప్రదాయ వస్త్రధారణ కేవలం కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు మాత్రమే అమలు చేశారు. తర్వాత దశలో అని రకాల ఆర్జిత సేవలకు అమలు చేశారు. నాలుగేళ్లుగా వీఐపీ దర్శనాల్లోనూ సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి చేశారు. ఇదే విధానాన్ని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు గత ఆగస్టు 27వ తేదీ నుంచి రూ.300 ఆన్‌లైన్ టికెట్ల భక్తులకు అమలు చేసేలా చర్యలు చేపట్టారు. దీనినే గత నెల నుంచి 50 రూపాయల సుదర్శనం భక్తులకూ అమలు చేస్తున్నారు. అన్ని దర్శనాల్లోనూ సంప్రదాయ దుస్తుల విధానం అమలు చక్కగా సాగుతోంది. ప్రారంభంలో బాలారిష్టాలున్నా, తర్వాత యథావి ధిగా సాగుతోంది.
సర్వదర్శనం, దివ్యదర్శనానికి డ్రస్‌కోడ్..
ప్రస్తుతం అమలు చేసే దర్శనాల్లో భక్తులు ఇంటిల్లిపాదిగా సంప్రదాయ దుస్తులతో వెళుతున్నారు. ఈ డ్రెస్‌కోడ్‌పై అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. దీంతో మిగిలిన సర్వదర్శనం, దివ్యదర్శనం, చంటిబిడ్డల తల్లిదండ్రుల దర్శనం, వికలాంగులు, వృద్ధుల వంటి దర్శనాలకూ డ్రస్‌కోడ్ అమలు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆలయ అర్చకులు, ఆగమ పండితులు కూడా ఇదే అభిప్రా యం వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి రావడం వల్ల భక్తుల్లో భక్తిభావంతో పాటు సనాతన హైందవ సంస్కృతిని చాటేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.